‘కరోనా’ పోరులో రక్షణ సంస్థలు
ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని దేశవ్యాప్తంగా కట్టడి చేసేందుకు చేపట్టిన పోరులో కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ పరిధిలోని...

న్యూఢిల్లీ, ఏప్రిల్6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని దేశవ్యాప్తంగా కట్టడి చేసేందుకు చేపట్టిన పోరులో కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సయూ) ఆర్డ్‌నెన్సు ఫ్యాక్టరీ బోర్డు (ఓఎ్‌ఫబీ)లు భాగస్వామ్యం అయ్యాయని ఆ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
10 ఆర్డ్‌నెన్స్ ఆస్పత్రుల్లో ‘కరోనా‘ సేవలు
ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఆధ్వర్యంలో దేశంలోని ఆరు రాష్ర్టాలలో గల 10 ఆస్పత్రుల్లో 280 ఐసోలేషన్ పడకలను కరోనా (కొవిడ్-19) వైద్య సేవలకోసం కేటాయించారు. జబల్పూరులోని వెహికల్ ఫ్యాక్టరీ, పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపూర్‌లో గల మెటల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇదే రాష్ట్రంలోని గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ, మహారాష్ట్రలోని ఖడ్కిలో గల అమ్యూనిషన్ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గల ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ, తమిళనాడులోని ఖమరియాలో గల ఆర్డ్‌నెన్సు ఫ్యాక్టరీ, ఇదే రాష్ట్రంలోని ఆవడిలో గల హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, తెలంగాణలోని మెదక్‌లో గల ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలకు చెందిన ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వైద్య సేవలు కల్పించాలని నిర్ణయించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కరోనా రోగుల కోసం ఓఎ్‌ఫబీ 50 ప్రత్యేకమైన గుడారాలను అతితక్కువ సమయంలో రూపొందించి, సరఫరా చేసినట్లు తెలిపారు.
శానిటైజర్ ఉత్పత్తి
ప్రపంచ ఆరోగ్యసంస్థ జారీచేసిన మార్గదర్శకాలకు లోబడి ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీకి చెందిన పరిశ్రమలు హ్యాండ్ శానిటైజర్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్రీకృత సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వంచే నోడల్ ఏజెన్సీగా నియమించబడిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి వీటికి 13వేల లీటర్ల శానిటైజర్ కావాలని ఆర్డర్ లభించిందని తెలిపారు. తొలి విడతగా గత నెల 31న తమిళనాడులోని అరువన్‌కాడులో గల కోర్ డైట్ ఫ్యాక్టరీ నుంచి 1500 లీటర్ల శానిటైజర్‌ను పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ, మహారాష్ట్రలోని భండారాలో గల ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలలో భారీ స్థాయిలో శానిటైజర్‌ను ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీల ద్వారా దేశ అవసరాలను తీర్చడానికి వీలుగా రోజుకు మూడు వేల లీటర్ల శానిటైజర్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు.
మాస్కులు, కోటుల తయారీ
కాన్పూర్, షాజహాన్‌పూర్, ఫిరోజాబాద్‌లోని హజరత్‌పూర్, చెన్నైలో ఉన్న ఆర్డ్‌నెన్స్ ఎక్వి్‌పమెంట్ ఫ్యాక్టరీలలో కరోనా వైద్య సిబ్బదికి అవసరమైన కోటులు (కవర్ ఆల్స్) మాస్కులు తయారు చేస్తున్నారు. అతితక్కువ సమయంలో వీటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రత్యేక హీట్ సీలింగ్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు.
వెంటిలేటర్ల తయారీ
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ సూచనలకు లోబడి భారత్ ఎలాక్ర్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఆధ్వర్యంలో ఐసీయూల కోసం రాబోయే రెండు నెలల్లో 30వేల వెంటిలేటర్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడానికి నిర్ణయించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ముందస్తుగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల రిపేర్ పనులను తెలంగాణలోని మెదక్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ చేపట్టినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.