భారీగా ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

ABN , First Publish Date - 2020-08-12T01:32:25+05:30 IST

సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్

భారీగా ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

న్యూఢిల్లీ : సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.8,722 కోట్ల విలువైన విమానాలు, ఆయుధాల కొనుగోలుకు పచ్చ జెండా ఊపింది. వీటిలో భారత వాయు సేన (ఐఏఎఫ్) కోసం 106 బేసిక్ ట్రైనర్ విమానాలు కూడా ఉన్నాయి. దేశీయ సామర్థ్యంపై ఆధారపడుతూ సాయుధ బలగాలు బలోపేతమవడానికి ఈ చర్య దోహదపడుతుందని చెప్తున్నారు. 


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 106 బేసిక్ ట్రైనర్ విమానాలను సేకరిస్తారు. దీంతో భారత వాయు సేన సరికొత్త బలం పొందుతుంది. 


భారత నావికా దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ యుద్ధ నౌకలపై అమర్చే ప్రధానమైన సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్‌ల అప్‌గ్రేడెడ్ వర్షన్‌ను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) నుంచి సేకరిస్తారు. 


మాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, డిజైన్, డెవలప్‌మెంట్ దేశీయంగానే జరిగే విధంగా ఆర్మర్ పీర్సింగ్ ఫిన్ స్టెబిలైజ్డ్ డిస్కార్డింగ్ సబోట్ ఆయుధాలను సేకరిస్తారు. ఇది భారత సైన్యం శక్తి, సామర్థ్యాలను మరింత పెంచుతుంది.



Updated Date - 2020-08-12T01:32:25+05:30 IST