గాల్వన్ లోయలో ప్రతిష్టంభనపై కేరళ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-06-17T03:47:19+05:30 IST

వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య

గాల్వన్ లోయలో ప్రతిష్టంభనపై కేరళ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

తిరువనంతపురం : వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడటం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


విజయన్ మంగళవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘గాల్వన్ లోయలో ప్రతిష్టంభన వార్తలు మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమరులైన సైనికుల కుటుంబాలకు అత్యంత ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము మన సాయుధ దళాల సిబ్బందికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. సాహసికులైన సైనికులు, వారి కుటుంబ సభ్యుల ఆవేదనలో పాలుపంచుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. 


వాస్తవాధీన రేఖ వెంబడి లడఖ్‌లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత దళాలపై చైనా సైనికులు విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై భారత సైన్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గాల్వన్ లోయలో ఘర్షణ తీవ్రతను తగ్గించే ప్రక్రియ జరుగుతుండగా, సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారిలో చైనా, భారత్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. భారత సైన్యం ఓ అధికారిని, ఇద్దరు సైనికులను కోల్పోయిందని పేర్కొంది. 


కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు (తెలంగాణా), హవల్దార్ కే పళని (తమిళనాడు), సిపాయి ఓఝా (జార్ఖండ్) ఈ దాడిలో అమరులయ్యారు. 


కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్యాబిడ్డలు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన తల్లి మంజుల మాట్లాడుతూ తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం తనకు గర్వకారణమని తెలిపారు. అయితే ఓ బిడ్డకు తల్లిగా ఆమె సహజసిద్ధమైన ఆవేదన వ్యక్తం చేశారు. 
Updated Date - 2020-06-17T03:47:19+05:30 IST