దీపావళి టు దీపావళి... బంగారం ధర రూ. 13 వేలకు పైగా జంప్...
ABN , First Publish Date - 2020-11-13T21:29:50+05:30 IST
దీపావళి టు దీపావళి... బంగారం ధర రూ. 13 వేలకు పైగా జంప్...
ముంబై : దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు బహుమతులు కొనుగోలు చేయం జరుగుతుంటుంది. ఈ క్రమంలో... అమ్మకాలు అధికంగా ఉంటుంటాయి. ఉద్యోగులకు కంపెనీలు బోనస్‌లు, బహుమతులను ఇస్తుంటాయి. కరోనా నేపథ్యంలో మొన్నటివరకు ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దీంతో... ఈ దఫా కొనుగోళ్లు ఉండనున్నప్పటికీ... గత ఏడాదితో పోలిస్తే మాత్రం తగ్గే అవకాశాలే ఉన్నాయి.
కిందటి దీపావళి నుండి ఈ దీపావళి వరకు పసిడి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల పసిడి గత దీపావళి సమయంలో రూ. 40 వేల వరకు పలికింది. ఈ దీపావళికి రూ. 52 వేలు దాటింది. ప్రాంతాన్ని బట్టి రూ. 51వేల నుండి రూ. 53వేల వరకు ఉంటోంది. అంటే దాదాపు రూ. 13 వేల వరకు పెరిగింది. కాగా... కరోనా నేపథ్యంలో రూ. 58 వేలు దాటిన బంగారం ధర ఇప్పుడు రూ. 5 వేలకు పైగా తక్కువగా ఉంది. ధరలు ఎక్కువగాఉండటం, కరోనా పరిణామాల నేపథ్యంలో కొనుగోళ్లు గతంలో మాదిరిగా లేనట్లు కనిపిస్తోంది. ఇక తాజా పరిస్థితుల్లో పాత బంగారాన్ని మార్చి కొత్తది కొనుగోలు చేసేలా ఆఫర్లు భారీగానే తెరమీదకు వచ్చాయి. 2018 దీపావళి సమయానికి రూ. 33 వేలున్న 10 గ్రాముల పసిడి, 2019 నాటికి రూ. 39 వేలకు, 2020 నాటికి రూ. 52 వేలకు పైగా ఉంది.
డిమాండ్ పుంజుకుంటే ధరలు పెరగొచ్చు...
భారత్ లో దసరా, దీపావళి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి సందర్భాల్లో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటూండడం ఆనవాయితీగా వస్తోంది. ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్లు కాస్త తగ్గుతాయేమో కానీ అమ్మకాలు మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంటాయి. ఇక దేశంలో గోల్డ్ ప్రీమియం మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. దీపావళి సీజన్‌లో అమ్మకాలు బాగుంటాయని జ్యువెలరీ యజమానులు ఆశభావంతో ఉన్నారు. పసిడి ధరలు ఈ ఏడాది 25 శాతం రిటర్న్స్ ఇచ్చాయని వాణనిజ్యవర్గాలు చెబుతున్నాయి. ఇది సురక్షిత పెట్టుబడి కావడం, మంచి రిటర్న్స్ రావడం అమ్మకాలకు దోహదం చేసినట్లు భావిస్తున్నారు. డిమాండ్ పెరిగితే ధరలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కలిసి వస్తుందని భావించినప్పటికీ...
ఈ ధనత్రయోదశి కలిసి వస్తుందని భావించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు మాత్రం 30 శాతం మేరకు తగ్గుతాయని రిటైల్ వ్యాపారులు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత ఏడాది 20 శాతానికి పైగా అమ్మకాలు క్షీణించాయి. ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.4 వేలు-రూ. 5 వేల వరకు తగ్గడం, కొంతకాలంగా స్థిరంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశాలని చెబుతున్నారు. కాగా... ఈ రోజు బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయ. మధ్యాహ్నం 3.15 గంటలకు డిసెంబరు గోల్డ్ ఫ్యూచర్ రూ. 64 పెరిగి రూ. 50,664 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 90 పెరిగి రూ. 50,763 వద్ద ట్రేడ్ అయ్యాయి. కిలో డిసెంబరు సిల్వర్ ఫ్యూచర్స్ రూ. 71 పెరిగి రూ. 62,810 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ. 43 పెరిగి రూ. 64,500 వద్ద ట్రేడ్ అయ్యాయి.