బోస్ పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి... మోదీకి మమత లేఖ

ABN , First Publish Date - 2020-11-19T01:30:08+05:30 IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ పుట్టిన రోజైన జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని..

బోస్ పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి... మోదీకి మమత లేఖ

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ పుట్టిన రోజైన జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు ప్రధానికి బుధవారంనాడు మమతా బెనర్జీ లేఖ రాశారు. నేతాజీ అదృశ్యం మిస్టరీని కనుగొనేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు.


'నేతాజీ పుట్టినరోజును ఏటా దేశ వ్యాప్తంగా ఎంతో గర్వంగా, ఆరాధనాభావంతో జరుపుకొంటారు. నేతాజీ పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలని చాలా కాలంగా మేము కోరుతున్న విషయాన్ని దయతో మీరు గుర్తుచేసుకోవాలి. అయితే, మా విజ్ఞప్తి ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు' అని ఆ లేఖలో మమత పేర్కొన్నారు. నేతాజీ వంటి గొప్ప నేత, నేషనల్ హీరోకు నిజమైన గౌరవం దక్కాలనే తలంపుతోనే జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మరోసారి కోరుతున్నామని అన్నారు. దృఢ సంకల్పం, సాహసం, నాయకత్వం, ఐక్యత, మాతృభూమిపై అపార ప్రేమ కలిగిన మహానేత నేతాజీ అని, ఆయన 125 జయంత్యుత్సవం దగ్గర పడుతున్న తరుణంలో బోస్ పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించడానికి ఇదే మంచి తరుణమని అన్నారు. ఇది ఆయనకు మనమిచ్చే నిజమైన గౌరవం అవుతుందని కూడా మమత పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ పాత్ర తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన నాయకత్వంలో వేలాది మంది ఇండియన్ నేషనల్ ఆర్మీ జవాన్లు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు.


'నేజాతి అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగా నిలిచిన విషయం మీకు తెలుసు. దేశ ప్రజలు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు వాస్తవాల తెలుసుకునే హక్కు ఉంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే అనేక ఫైళ్లను డీక్లాసిఫై చేసి, పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది. మొత్తం వ్యవహారంపై వాస్తవాలు వెలికి తీసి, దీనిపై ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలని అనేక సందర్భాల్లో మేము కోరాం. వాస్తవాలను వెలికి తీసి వాటిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం వల్ల మహానేత నేతాజీకి ఏమి జరిందనే విషయం ప్రజలు తెలుసుకోగలుగుతారు' అని మమత ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-11-19T01:30:08+05:30 IST