వలస కూలీలపైకి మృత్యు శకటం.. 16 మంది మృతి

ABN , First Publish Date - 2020-05-09T08:35:09+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ.. ఉపాధి లేక.. ఆ కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో.. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘాను తప్పించుకునేందుకు రైలు పట్టాలే కాలిబాటగా పయనమయ్యారు.

వలస కూలీలపైకి మృత్యు శకటం.. 16 మంది మృతి

  • లాక్‌డౌన్‌తో స్వస్థలానికి 20 మంది కూలీలు
  • రైలు పట్టాలపైనే నిద్ర.. దూసుకొచ్చిన గూడ్స్‌
  • చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
  • తెగిపడిన శరీర భాగాలు 
  • మహారాష్ట్రలో విషాదం
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్ర్భాంతి’

ఔరంగాబాద్‌, న్యూఢిల్లీ, మే 8: లాక్‌డౌన్‌ వేళ.. ఉపాధి లేక.. ఆ కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో.. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘాను తప్పించుకునేందుకు రైలు పట్టాలే కాలిబాటగా పయనమయ్యారు. అలా 40 కిలోమీటర్లు నడిచాక అలసిసొలసి పట్టాలపైనే సేదతీరారు. ఆదమరిచి నిద్రలోకి జారుకున్నారు. లాక్‌డౌన్‌లో రైళ్లు రావనే అభిప్రాయంతో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కానీ, తెల్లవారు జామున ఓ గూడ్స్‌ రైలు వారి పైనుంచి దూసుకెళ్లింది. 16 మంది ప్రాణాలను చిదిమేసింది. ఈ హృదయవిదారక సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా కర్మద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మృతులంతా మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. వీరంతా మహారాష్ట్ర జాల్నాలోని ఉక్కు కర్మాగారంలో పనిచేస్తుంటారు.


లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజులుగా ఉపాధి లేక ఇక్కట్లపాలయ్యారు. మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉండటం.. రోజురోజుకీ తీవ్రత పెరుగుతుండటంతో.. ఇప్పట్లో లాక్‌డౌన్‌కు విముక్తి ఉండదని, స్వస్థలాలకు వెళ్లే కలోగంజో తాగొచ్చనే ఉద్దేశంతో 20 మంది రోజుకూలీలు జాల్నా రైల్వే స్టేషన్‌ నుంచి పట్టాల వెంబడి తమ స్వస్థలానికి పయనమయ్యారు. వారు రోజంతా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడిచి, రాత్రికల్లా కర్మద్‌కు చేరుకున్నారని ఔరంగాబాద్‌ ఎస్పీ మోక్షదా పాటిల్‌ తెలిపారు. ‘‘17 మంది పట్టాలపై నిద్రించారు. మరో ముగ్గురు పట్టాలకు దూరంగా సేదతీరారు. తెల్లవారుజామున 5.15 సమయంలో గూడ్స్‌ రైలు రావడాన్ని ఆ ముగ్గురూ గమనించి, పట్టాలపై పడుకున్న వారిని హెచ్చరించారు. బిగ్గరగా అరుస్తూ అటువైపు పరుగులు తీశారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది’’ అని ఎస్పీ వివరించారు. 16 మంది దుర్మరణం పాలవ్వగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, మిగతా ముగ్గురు క్షేమమని తెలిపారు. మృతుల శరీరభాగాలు రైల్వేట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి.


జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతుండటం.. రాకపోకలను పూర్తిగా నిషేధించడం వల్ల వీరంతా రైలు పట్టాల మీదుగా తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ది గ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈ ఘటనపై రైల్వే మంత్రి పియూష్‌గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు’’ అని ప్రధాని వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంతాపం తెలిపారు.


వారికి మహారాష్ట్ర సర్కారు రూ. 10 లక్షలు, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాందేడ్‌ డివిజన్‌ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి నిఘా లోపంపై విచారణ జరపనున్నారు. వారంతా పట్టాలపై నిద్రిస్తున్నా.. పెట్రోలింగ్‌ సిబ్బంది గుర్తించకపోవడంపై రైల్వే అధికారులు సీరియ్‌సగా ఉన్నారు. రైల్వే సేఫ్టీ విభాగం కమిషనర్‌ రామ్‌ కృపాల్‌ను విచారణాధికారిగా నియమించారు. కాగా రైల్వే పట్టాలపై ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ శైలేశ్‌ పాఠక్‌ అన్ని జోన్లకు ఆదేశాలిచ్చారు. కాగా.. ప్రమాదానికి కారణమైన గూడ్స్‌ రైలు లోకోపైలట్‌ పట్టాలపై ఎవరో ఉన్నట్లు గుర్తించి, సైరన్‌ మోగించినట్లు రైల్వే అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. రైలును ఆపేందుకు డ్రైవర్‌ ప్రయత్నించగా.. అతను స్పందించేలోగా దారుణం జరిగిపోయిట్టు గుర్తించారు.

Updated Date - 2020-05-09T08:35:09+05:30 IST