ఆఖరి ప్రయాణం

ABN , First Publish Date - 2020-05-17T07:29:37+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది వలస కార్మికులు చనిపోయారు. మరో 36 మంది గాయపడ్డారు.

ఆఖరి ప్రయాణం

  • యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
  • 25 మంది వలస కార్మికుల దుర్మరణం 
  • 36 మందికి గాయాలు.. 14 మందికి తీవ్రం
  • మృతులు పలు రాష్ట్రాలకు చెందిన వారు
  • ఆగివున్న లారీని ఢీకొట్టిన మరో ట్రక్కు
  • రెండు వాహనాల్లోనూ వలస కార్మికులు
  • ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర విచారం


ఔరయ్యా, మే 16: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది వలస కార్మికులు చనిపోయారు. మరో 36 మంది గాయపడ్డారు. అందులో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి 400 కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాజస్థాన్‌, ఢిల్లీల నుంచి వివిధ రాష్ట్రాలకు తిరిగి వెళుతున్న వలస కార్మికులు. 19వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం లారీని వెనుక నుంచి వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. రెండు వాహనాలు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గోతిలో పడిపోయాయి. రెండు వాహనాల్లోనూ వలస కూలీలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతానికి చెందిన కార్మికులు ఢిల్లీలో డీసీఎం లారీని అద్దెకు తీసుకొని, అందులో స్వగ్రామానికి వస్తున్నారు. మధ్యలో ఔరయ్యా జిల్లాలో రోడ్డు పక్కన చాయ్‌ కోసం లారీని ఆపారు.


అదే సమయంలో రాజస్థాన్‌ నుంచి కాల్షియం హైడ్రేట్‌ బస్తాల లోడ్‌తో మధ్యప్రదేశ్‌కు వెళుతున్న భారీ ట్రక్కులో బిహార్‌, జార్ఖండ్‌, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 50 మంది కార్మికులు ఎక్కారు. వారంతా మరో గంటన్నర ప్రయాణం తర్వాత లారీ దిగి, తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు వేరే వాహనాలను పట్టుకోవాల్సి ఉంది. ఇంతలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో (తెల్లవారుజామున 3.30 గంటలు) వలస కూలీలు కాల్షియం హైడ్రేట్‌ బస్తాలపై నిద్ర పోతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లారీల మీద ప్రయాణాన్ని అడ్డుకోనందుకు ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.  శనివారం రోడ్డు ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు, సంబంధిత రాష్ట్రాలూ స్పందించాయి. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలిచేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. రైళ్ల ద్వారా తమ కార్మికుల తరలింపునకు అవసరమైన మొత్తం ఖర్చును భరించేందుకు సిద్ధమని బెంగాల్‌ సర్కారు ప్రకటించింది.


రాష్ట్రపతి సంతాపం

యూపీ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. వలస కార్మికుల సమస్యలపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. యూపీ ప్రమాదం నేపథ్యంలో విమానాలు, రైళ్లు, బస్సులు పాక్షికంగానైనా నడిపేందుకు అనుమతించాలని పౌర విమానయాన మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పూరీ కోరారు. 


‘ఆన్‌లైన పోర్టల్‌’ : కేంద్రం

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపును సులభం చేసేందుకు కేంద్రం ఆన్‌లైన్‌ పోర్టల్‌ విధానాన్ని అమలు చేస్తోంది. తరలించాల్సిన వలస కార్మికుల వివరాలను అన్ని రాష్ట్రాలు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. 


నడిచి వెళ్లకండి.. మేమే పంపిస్తాం!

చెన్నై, మే 16 (ఆంధ్రజ్యోతి): చెన్నై సహా తమిళనాడులో పలు ప్రాంతాల నుంచి ఎంతోమంది వలస కార్మికులు వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వరాష్ట్రాలకు నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులు కాలినడకన, ఇతర వాహనాల్లో స్వస్థలాలకు వెళ్లరాదని సీఎం  పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల దుస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని వలస కార్మికులంతా వారికి కేటాయించిన శిబిరాలలోనే ఉండాలని, వారిని తామే స్వస్థలాలకు పంపుతామన్నారు. 



ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి


ప్రమాదంలో చనిపోయిన వలస కూలీల బ్యాగులు.. మృత దేహాలను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

Updated Date - 2020-05-17T07:29:37+05:30 IST