లష్కర్‌తో దావూద్ భేటీ.. భారత్‌లో భారీ దాడులకు కుట్ర

ABN , First Publish Date - 2020-05-11T20:14:52+05:30 IST

ఇస్లామాబాద్: భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర పన్నిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి

లష్కర్‌తో దావూద్ భేటీ..  భారత్‌లో భారీ దాడులకు కుట్ర

ఇస్లామాబాద్: భారత్‌‌లో మరోమారు ముంబై తరహా దాడులకు పాక్ కుట్ర పన్నిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. మే 10వ తేదీన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లష్కర్ ఎ తొయిబా ప్రతినిధులతో సమావేశమయ్యాడు. ఇస్లామాబాద్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నివాసానికి పక్కనే ఈ ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ బృందం కూడా పాల్గొంది. సముద్ర మార్గం గుండా గుజరాత్‌ లేదా మహారాష్ట్రలోకి ఆయుధాలు పంపేందుకు లష్కర్ ఎ తొయిబా యత్నాలు ప్రారంభించింది. 


కరోనాపై పోరులో భారత్ తలమునకలై ఉన్న తరుణంలో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని పాక్ యోచిస్తోంది. ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతోంది. లష్కర్ ఎ తొయిబా అధినేత హఫీజ్ సయీద్ ఆశీస్సులతో ఆ సంస్థ సెకండ్ చీఫ్ అబ్దుల్ రహమాన్ మక్కీ గతవారం దావూద్‌తో భేటీ అయ్యాడు. భారత్‌పై దాడులకు పథకం రచించడంతో పాటు అమలు జరిపే విషయంపై చర్చించాడు. దావూద్ గ్యాంగ్ సహకారంతో భారత్‌లోకి ఆయుధాలు చేరేలా చూడాలని ఐఎస్ఐ, లష్కర్ ఎ తొయిబా కోరాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక భారత్‌లో భారీ దాడులకు అవకాశం లేకుండా పోవడంతో ముంబై తరహా దాడి జరపాలని ఐఎస్ఐ పంతం పట్టింది. 


నిఘా వర్గాల సమాచారంతో భారత్ అప్రమత్తమైంది.   

Updated Date - 2020-05-11T20:14:52+05:30 IST