2005కు ముందు తండ్రి మరణించినా ఆస్తిలో వాటా

ABN , First Publish Date - 2020-08-12T07:16:27+05:30 IST

2004 డిసెంబరు 20వ తేదీకి ముందు సదరు ఆస్తిని పంపకం చేసినా, పరాధీనం చేసినా, విభజించినా, వీలునామా ప్రకారం పంపకాలు చేసినా సరే... హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 6(1) ప్రకారం కుమార్తె కూడా తన వాటా కోసం డిమాండ్‌ చేయవచ్చు...

2005కు ముందు తండ్రి మరణించినా ఆస్తిలో వాటా

  • కూతురికి పుట్టుకతోనే సంపదలో హక్కు
  • సవరించిన వారసత్వ చట్టానికి సుప్రీం భాష్యం
  • ఎప్పటికైనా కూతురు కూతురే!
  • పెళ్లి అయ్యే వరకే కుమారుడు కుమార్తె సమానత్వ 
  • హక్కును తోసిపుచ్చలేం
  • సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు


2004 డిసెంబరు 20వ తేదీకి ముందు సదరు ఆస్తిని పంపకం చేసినా, పరాధీనం చేసినా, విభజించినా, వీలునామా ప్రకారం పంపకాలు చేసినా సరే... హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 6(1) ప్రకారం కుమార్తె కూడా తన వాటా కోసం డిమాండ్‌ చేయవచ్చు.

-అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం


న్యూఢిల్లీ, ఆగస్టు 11: తండ్రి ఆస్తిలో కుమారుడితో సమానంగా కుమార్తెకూ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ హక్కు పుట్టుకతోనే వస్తుందని... ఆజన్మాంతం ఉంటుందని తెలిపింది. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌.నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. ‘కూతురు... ఎప్పటికీ కూతురే. కొడుకు మాత్రం పెళ్లయేదాకే కుమారుడు’ అని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వారసత్వ ఆస్తిలో మహిళలకు కూడా సమాన వాటా కల్పిస్తూ 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు. అయితే, సవరణ జరిగిన నాటికి తండ్రి, కుమార్తె జీవించి ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుందా లేక అంతకు ముందు నుంచీ వర్తిస్తుందా అనే అంశంపై స్పష్టత కోసం కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీటి విచారణ సందర్భంగా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ వారసత్వ చట్ట సవరణ నాటికి తండ్రి జీవించి ఉన్నాడా లేడా అన్నదానితో సంబంధం లేకుండా ఉమ్మడి కుటుంబ ఆస్తిపై అంతకు ముందు నుంచే కుమార్తె సమాన వాటా కలిగి ఉంటుందని స్పష్టం చేసింది.


‘‘2004 డిసెంబరు 20వ తేదీకి ముందు సదరు ఆస్తిని పంపకం చేసినా, పరాధీనం చేసినా, విభజించినా, వీలునామా ప్రకారం పంపకాలు చేసినా సరే... హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 6(1) ప్రకారం కుమార్తె కూడా తన వాటా కోసం డిమాండ్‌ చేయవచ్చు. కుమార్తెకు వారసత్వ హక్కు పుట్టుకతోనే సంక్రమిస్తుంది. అందువల్ల, చట్ట సవరణ అమలులోకి వచ్చిన (2005 సెప్టెంబరు 9) నాటికి తండ్రి జీవించి ఉన్నాడా లేడా అన్నదానితో సంబంధం లేదు. కుమార్తెలకు ఆజన్మాంతం ఈ హక్కు ఉంటుంది’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి వివిధ హైకోర్టులు, కింది కోర్టుల్లో ఎన్నో పిటిషన్లు విచారణలో ఉన్నాయని, వాటన్నిటిపై విచారణను ఆరు నెలల్లో ముగించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. నిజానికి, 2005లో చేసిన సవరణలో ఈ చట్టం గతానికి కూడా వర్తిస్తుందని (రెట్రోస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌) పేర్కొనలేదు. ఇప్పుడు దీనిపై సుప్రీకోర్టు స్పష్టత ఇచ్చింది.


Updated Date - 2020-08-12T07:16:27+05:30 IST