బలహీన పడుతోన్న ‘నివర్’.. అయినా భారీ వర్షాలు
ABN , First Publish Date - 2020-11-26T15:45:37+05:30 IST
అతి తీవ్ర తుఫానుతో పంటలు పాడవుతాయని ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరిల్లోనూ తుఫాన్ ప్రభావం చూపుతుందన్న

చెన్నై: ‘నివర్’ తుఫాను కాస్త బలహీన పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరిలకు మాత్రం భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతం వెంబడి మరక్కనం పట్టణంతో పాటు పదుచ్చేరికి 30 కిలోమీటర్ల ప్రాంతం మేరకు రాత్రి 2:30 గంటల వ్యవధిలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు. కాగా, తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు రెండు లక్షలకు పైగా ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశంలో ఇప్పటి వరకు ఏర్పడ్డ అతిపెద్ద తుఫాన్లలో నివర్ ఐదవదని చెబుతున్నారు. పెద్ద స్థాయిలో వరదలు సంభవించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతస్థాయిలో పని చేస్తున్నాయి.
ఇక నివర్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తాకనుంది. ముఖ్యంగా ఇక్కడి రైతులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి తీవ్ర తుఫానుతో పంటలు పాడవుతాయని ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరిల్లోనూ తుఫాన్ ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలతో ఆ జిల్లాల్లోనూ వరి, పత్తి, మిర్చి, అపరాల పంటలతోపాటు చేపలు, రొయ్యల పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. పంట కోసిన రైతులు నానా హైరానా పడి ఇళ్లకు, గిడ్డంగులకు చేరుస్తున్నారు.