ఆంఫన్ తుపాన్ ఎఫెక్ట్: 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2020-05-18T10:55:38+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని 12 సముద్రతీర ప్రాంత జిల్లాల్లో సోమవారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు....

ఆంఫన్ తుపాన్ ఎఫెక్ట్: 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్

 11 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు

భువనేశ్వర్(ఒడిశా): ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘ఆంఫన్‌’ తుపాను సోమవారం  అతితీవ్ర తుపానుగా మారింది. రానున్న ఆరు గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా మారుతుండటంతో ఒడిశా రాష్ట్రంలోని 12 సముద్రతీర ప్రాంత జిల్లాల్లో సోమవారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని 12 జిల్లాల్లోని సముద్ర తీరప్రాంతాల్లో నివాసముంటున్న 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఆంఫన్ తుపాన్ ఈ నెల 20వతేదీన వాయవ్య బంగాళాఖాతం మీదుగా 20న పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరప్రాంతమైన దిఘా- హతియా దీవుల మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ సోమవారం ట్వీట్ చేసింది. ఒడిశా రాష్ట్రంలోని కియోనజార్ జిల్లా జుంపుర, కియోనిజార్, పట్నా, సహర్ పద, చాంపువా బ్లాక్ లు, మయూర్ భంజ్ జిల్లాలోని సుక్రూలీ, రారున్, కరాజియా బ్లాకుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశాతోపాటు పశ్చిమబెంగాల్ సముద్ర తీరప్రాంతాల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించారు.ఒడిశా రాష్ట్రంలోని  పూరి, జగత్ సింగ్ పూర్, కేంద్రపద, బాలాసోర్, జాజ్ పూర్, భద్రాక్, మయూర్ భంజ్ జిల్లాలు,  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాస్, నార్త్ 24 పరగణాస్, ఈస్ట్, వెస్ట్ మిడ్నాపూర్, హౌరా,హుబ్లీ జిల్లాల్లో సముద్రతీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఒడిశాలో 567 తుపాన్ షెల్టర్లు, 7,092 భవనాల్లో బాధితుల కోసం సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఒడిశా రాస్ట్ర సహాయ పునరావాస కమిషనర్ పీకే జెనా చెప్పారు. 

Updated Date - 2020-05-18T10:55:38+05:30 IST