భారతీయ టెకీలు, ఐటీ కంపెనీలకు ఊరట
ABN , First Publish Date - 2020-12-03T07:33:32+05:30 IST
భారతీయ టెకీలు, ఐటీ కంపెనీలకు ఊరట

హెచ్1-బీ వీసాపై ట్రంప్ సర్కారు సవరణలకు కోర్టు బ్రేకులు
వాషింగ్టన్, డిసెంబరు 2: హెచ్1-బీ వీసా జారీ విధానానికి ట్రంప్ సర్కారు చేసిన కీలక సవరణలకు అమెరికా కోర్టు బ్రేకులు వేసింది. కాలిఫోర్నియాలోని జిల్లా జడ్జి జెఫ్రీవైట్ తాజా సవరణలను తోసిపుచ్చారు. సర్కారు ఈ సవరణలను.. కరోనా వల్ల ఉద్యోగ నష్టాలను పూడ్చే ప్రయత్నమంటూ సమర్థించుకోవడం సరికాదని.. కరోనాకు ముందే ట్రంప్ సర్కారుకు ఈ ఆదేశాల జారీపై ఒక స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు తాజా నిర్ణయంతో భారతీయ టెకీలు, భారతీయ కంపెనీలకు ఊరట లభించినట్లయింది. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. థర్డ్ పార్టీ సంస్థల్లో హెచ్1-బీ ఉద్యోగ నియామకాలపై ఏడాది నిషేధం ఉంటుంది.
విదేశీ నిపుణులను అడ్డుకోవడం ద్వారా.. స్థానికులకు ఉపాధి లభిస్తుందనేది ట్రంప్ సర్కారు ఉద్దేశం. ఈ నిర్ణయాన్ని బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, యుఎస్ చాబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి గ్రూపులు కోర్టులో సవాలు చేశాయి. వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈ ఆంక్షలను తోసిపుచ్చింది. ఏటా 85వేల హెచ్1-బీ వీసాలు జారీ అవుతుండగా.. ఈ వీసాలు పొందిన వారు మూడేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఈ వీసాలపై అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారత్, చైనీయుల వాటా 6 లక్షలు.