ముడిచమురు ధర.. ఐదు నెలల కనిష్ఠం
ABN , First Publish Date - 2020-11-03T07:24:17+05:30 IST
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బాగా తగ్గుతున్నాయి. బ్యారల్ బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర సోమవారం 37 డాలర్ల స్థాయిలో కదలాడింది. కరోనా విజృంభణ నేపథ్యంలో యూర్‌పలోని పలు దేశాల్లో మళ్లీ విధించిన లాక్‌డౌన్‌లు ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నట్టు...
- అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ధర 37 డాలర్ల స్థాయిలో
న్యూఢిల్లీ, నవంబరు 2: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బాగా తగ్గుతున్నాయి. బ్యారల్ బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర సోమవారం 37 డాలర్ల స్థాయిలో కదలాడింది. కరోనా విజృంభణ నేపథ్యంలో యూర్‌పలోని పలు దేశాల్లో మళ్లీ విధించిన లాక్‌డౌన్‌లు ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడవచ్చన్న భయాలతో పాటు ముడిచమురు ఉత్పత్తి పెరగడం ధరలు తగ్గడానికి కారణమవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ముడిచమురు ధరలు 5 నెలల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఇంతకు ముందు జూన్ ప్రారంభంలో బ్యారల్ ముడిచమురు ధర 37 డాలర్ల స్థాయిలో కదలాడింది. ఇక భారత ఫ్యూచర్స్ మార్కెట్‌లో గత వారంలో బ్యారెల్ ముడిచమురు ధర రూ.400 తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో సోమవారం క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 2.88 శాతం (రూ.76) తగ్గి రూ.2,566కు చేరుకుంది. ముడిచమురు ధరలు తగ్గుతున్నందు వల్ల దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని వాహనదారులు ఆశిస్తున్నారు.