కేంద్ర బలగాల్లో తొలి కరోనా మరణం
ABN , First Publish Date - 2020-04-29T01:43:36+05:30 IST
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి ఇవాళ కరోనా కారణంగా..

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి ఇవాళ కరోనా కారణంగా మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఏఎస్ఐ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో కొద్ది రోజుల క్రితం సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచినట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దాదాపు పది లక్షల మందికి పైగా సిబ్బందితో పటిష్టమైన దళాలుగా గుర్తింపు పొందిన కేంద్ర బలగాల్లో ఇదే తొలి కరోనా మరణం కావడం గమనార్హం.
దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు గస్తీలోనూ కీలక పాత్ర పోషించే కేంద్ర బలగాలు.. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పనిచేస్తాయి. కాగా సీఆర్‌పీఎఫ్‌లో ఇప్పటి వరకు 23 మంది సిబ్బంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. వారి క్యాంపులో ఎవరైనా సహచరుడి ద్వారా వీరికి కొవిడ్-19 సోకినట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి ఇతర కేంద్ర బలగాల్లో కూడా ఇటీవల కొన్ని కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.