విమర్శకులు జాతి వ్యతిరేకులు కారు

ABN , First Publish Date - 2020-02-16T07:20:55+05:30 IST

తమతో విభేదించేవారిని జాతి వ్యతిరేకులుగానో లేక ప్రజాస్వామ్య వ్యతిరేకులుగానో గంపగుత్తగా ముద్ర వేస్తే రాజ్యాంగ విలువలకూ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ శరాఘాతంగా మారుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ హెచ్చరించారు. వివిధ అంశాలపై విభేదించడం, అసమ్మతి తెలపడం

విమర్శకులు జాతి వ్యతిరేకులు కారు

  • అందరిపై గంపగుత్తగా ముద్ర వేయొద్దు
  • ‘సీఏఏ’ నేపథ్యంలో జస్టిస్‌ చంద్రచూడ్‌


అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 15: తమతో విభేదించేవారిని జాతి వ్యతిరేకులుగానో లేక ప్రజాస్వామ్య వ్యతిరేకులుగానో గంపగుత్తగా ముద్ర వేస్తే రాజ్యాంగ విలువలకూ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ శరాఘాతంగా మారుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ హెచ్చరించారు. వివిధ అంశాలపై విభేదించడం, అసమ్మతి తెలపడం ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షక కవాటం(సేఫ్టీవాల్వ్‌)గా పనిచేసి పటిష్ఠం చేస్తుందని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ), జాతీయ పౌరుల జాబితా(ఎన్నార్సీ)ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విభేదించేవారినీ, విమర్శకులనూ అణచివేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తే చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచినట్లేననీ, దీని ఫలితంగా ప్రజలలో భయోత్పాత వాతావరణం నెలకొంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ప్రశ్నించేవారినీ, విమర్శించేవారినీ, అసమ్మతి తెలిపేవారినీ అణచివేస్తే ఆ చర్యలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలకు సంబంధించి అన్నిరకాల అభివృద్ధి మూలాలనూ ధ్వంసం చేస్తాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ హెచ్చరించారు. విమర్శకుల నోరునొక్కి, ప్రజల మనసుల్లో భయాందోళనలు కలిగిస్తే అది చివరకు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, రాజ్యాంగ విలువలను హరించేదాకా వెళుతుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ‘హిందువుల ఇండియా’, ‘ముస్లింల ఇండియా’ అన్న భావనలను తిరస్కరించారని, వారు మన దేశాన్ని ‘‘భారత గణతంత్ర’’ దేశంగా తీర్చిదిద్దారని ఆయన వ్యాఖ్యానించారు.

ధైర్యసాహసాలు లాయర్‌కు కీలకం

ఏదైనా విషయమై విమర్శించాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా తమ అభిప్రాయం చెప్పాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. న్యాయవాదికి ధైర్యసాహసాలు ముఖ్యమని గుజరాత్‌లో ‘లా’ విద్యార్థులనుద్దేశించి అన్నారు. 

Updated Date - 2020-02-16T07:20:55+05:30 IST