వచ్చే ఏడాది ప్రారంభంలో కోవిడ్ వ్యాక్సిన్ : హర్షవర్ధన్

ABN , First Publish Date - 2020-09-17T20:55:10+05:30 IST

వచ్చే ఏడాది నాటికి భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు..

వచ్చే ఏడాది ప్రారంభంలో కోవిడ్ వ్యాక్సిన్ : హర్షవర్ధన్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నాటికి భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. గురువారంనాడు రాజ్యసభలో ఆయన కీలక ప్రసంగం చేస్తూ, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ప్రధాని ఎంతో సమర్ధవంతంగా, జాగరూకతతో వ్యవహరించారని అభినందించారు.


'కోవిడ్ పరిస్థితిని ఎంతో జాగరూకతతో స్వయంగా మానిటరింగ్ చేస్తూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో అలానే భారత్‌లోనూ చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధాని నిర్దేశకత్వంలో నిపుణుల కమిటీ దీనిపై పనిచేసింది. ముందస్తు వ్యూహాలు అమలు చేశాం. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తందనే ఆశావహ దృక్పథంతో ఉన్నాం' అని హర్షవర్ధన్ తెలిపారు.


'జనవరి 8 నుంచే ప్రధాని, మంత్రులు, రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాలోచనలు జరిపాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో కలిసి కోవిడ్‌పై పోరాటం సాగించారు. జనవరి 30న దేశంలో తొలి కేసు వెలుగుచూడటానికి ముందే అన్ని రకాలైన అడ్వైజరీలు, వివరాలు అందిస్తూ వచ్చాం. తొలి కేసులో విస్తృతమైన కాంటాక్ట్-ట్రేసింగ్ కూడా చేపట్టాం. తొలి కేసులోనే 162 కాంటాక్ట్‌ల జాడ కనుగొన్నాం. ఆ విధంగా మన కాంటాక్ట్ ట్రేసింగ్ హిస్టరీ మొదలైంది' అని కేంద్ర మంత్రి వివరించారు. లాక్‌డౌన్‌తో 14 నుంచి 29 లక్షల మధ్య కేసులను నిరోధించగలిగామని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అడిగిన ఓ ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిచ్చారు.

Updated Date - 2020-09-17T20:55:10+05:30 IST