వైద్యుల సలహాపై ట్రంప్ ఆసుపత్రిలో చేరిక

ABN , First Publish Date - 2020-10-03T11:40:34+05:30 IST

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

వైద్యుల సలహాపై ట్రంప్ ఆసుపత్రిలో చేరిక

వాషింగ్టన్ (అమెరికా): కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైద్య చికిత్స కోసం  ఆసుపత్రిలో చేరారు. తన వ్యక్తిగత వైద్యుడు, అమెరికా వైద్యనిపుణుల సిఫారసు మేర రాబోయే కొద్దిరోజుల పాటు వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరానని ట్రంప్ శుక్రవారం రాత్రి ధ్రువీకరించారు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లకు గురువారం రాత్రి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ‘‘మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరాను. నేను బాగానే ఉన్నాను, మేం పని చేసేలా చూసుకోబోతున్నాం. ప్రథమ మహిళ మెలానియా  బాగానే  ఉంది’’ అని ట్రంప్ అన్నారు. 


అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం మధ్యాహ్నం కొంత అలసటగా ఉన్నా ఉత్సాహంతోనే ఉన్నారని, ముందుజాగ్రత్త చర్యగా ట్రంప్ కు రెజెనెరాన్ పాలిక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ 8 గ్రాముల మోతాదు ఇచ్చామని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ కొన్లీ తన అధికారిక ప్రకటనలో తెలిపారు. మెలానియా ట్రంప్ కు తేలికపాటి దగ్గు, తలనొప్పి ఉందని, మిగిలిన కుటుంబసభ్యులు బాగానే ఉన్నారని, వారికి కరోనా నెగిటివ్ అని వచ్చిందని వైద్యులు చెప్పారు. ట్రంప్ ప్రచార కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా వాయిదా వేశామని, కొన్ని వర్చువల్ ఫార్మాట్ లో నిర్వహిస్తామని ప్రచార నిర్వాహకుడు బిల్ స్టెపియన్ చెప్పారు. 


వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ చాలా జాగ్రత్తలు తీసుకొని అధ్యక్ష కార్యాలయాల నుంచి వచ్చే కొద్ది రోజులు ఆసుపత్రిలో పని చేస్తారని  ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని, వైద్యనిపుణుల సిఫారసు తీసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తారని మెక్ ఎననీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-10-03T11:40:34+05:30 IST