పాకిస్థాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 2,071
ABN , First Publish Date - 2020-04-01T23:46:01+05:30 IST
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ సోకడంతో

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ సోకడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈ మహమ్మారిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నట్లు సమాచారం.
కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2071కి చేరింది. రోగులకు పరీక్షలు నిర్వహించేందుకు, చికిత్స చేసేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది ముందుకు రావడం లేదని తెలుస్తోంది. సామాజిక దూరం పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అదికారులు విఫలమవుతున్నారు. మసీదులను మూసివేసేందుకు మత పెద్దలు అంగీకరించడం లేదు.
ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ఒకరికొకరు దూరంగా ఉండటం తప్పనిసరి అని వైద్య నిపుణులు పదే పదే చెప్తున్నప్పటికీ, మసీదుల వద్ద ఈ నిబంధనలను పాటించడం లేదని తెలుస్తోంది.
అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 740 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. సింధ్‌లో 676, బలూచిస్థాన్‌లో 158, ఇస్లామాబాద్‌లో 54, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుండగా, మీర్‌పూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. వీరికి పరీక్షలు నిర్వహించడం లేదని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచడం లేదని తెలుస్తోంది.
ఇరాన్ కొందరు యాత్రికులను సరిహద్దులోని మానవ రహిత భూభాగంలో వదిలిపెట్టింది. వీరు టఫ్టన్ గుండా పాకిస్థాన్‌లో ప్రవేశిస్తున్నట్లు సమాచారం. వీరి కారణంగానే సింధ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కరోనా వైరస్ రోగులను ప్రజలు నేరస్థులుగా చూస్తున్నారని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వృద్ధులను, బలహీనులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం ఉంటుందన్నారు. ఆత్మ విశ్వాసంతో కరోనా వైరస్‌ను ఎదుర్కొంటామన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు ప్రభుత్వానికి ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు.