ఉద్యోగాలపై కోవిడ్-19 భారీ దెబ్బ : మూడీస్

ABN , First Publish Date - 2020-03-24T23:32:39+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 మహమ్మారి సునామీలా విరుచుకుపడిందని మూడీస్ అనలటిక్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది.

ఉద్యోగాలపై కోవిడ్-19 భారీ దెబ్బ : మూడీస్

న్యూయార్క్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 మహమ్మారి సునామీలా విరుచుకుపడిందని మూడీస్ అనలటిక్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఆసియాలో ప్రధాన దేశాలు, యూరోపియన్ దేశాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోందని తెలిపింది. 


మూడీస్ అనలటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జండీ రాసిన విశ్లేషణలో కంపెనీల మూసివేతలు, వ్యాపారాలు పెట్టుబడులను కుదించడం, రిటైర్‌మెంట్ కోసం దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడం వంటివాటి వల్ల మరింత ఎక్కువ ఆర్థిక బాధలు వేగంగా కమ్ముకొస్తున్నాయని చెప్పారు. రాబోయే వారాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నట్లు తెలిపారు. నెలసరి ఆదాయంపై జీవించే కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. 


కరోనా వైరస్ ప్రభావం కనిపించక ముందు, జనవరిలో మూడీస్ అంచనా ప్రకారం ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2020లో 2.6 శాతం. ప్రస్తుతం విరుచుకుపడుతున్న కోవిడ్-19 మహమ్మారి ప్రయాణ, వ్యాపార, వాణిజ్య, ఇతర వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో వాస్తవ జీడీపీ 0.4 శాతం పతనమవుతుందని అంచనా వేస్తున్నారు. చైనా జీడీపీ మొదటి త్రైమాసికంలో 27 శాతం వార్షిక రేటుతో క్షీణిస్తుందని జండీ చెప్పారు.  


కోవిడ్-19 మునుపెన్నడూ లేనటువంటి అంతర్జాతీయ మహమ్మారి అని, ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ అని జండీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు షట్‌డౌన్ అవుతున్నాయని, వ్యాపారాలకు అకస్మాత్తుగా ఎదురైన కుదుపు వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతోందని తెలిపారు. ఒత్తిడిలో ఉన్న కుటుంబాలకు, వ్యాపారాలకు ఆర్థిక మద్దతివ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు.


అమెరికా వ్యాపారాలు లే ఆఫ్ ప్రకటించడంతో నిరుద్యోగ బీమా క్లెయిములు మార్చి 8తో ముగిసిన వారం 2.80 లక్షలకు పెరిగాయి. అంతకుముందు వారం ఈ క్లెయిముల సంఖ్య 2.10 లక్షలు. ఉద్యోగావకాశాలు వృద్ధి చెందడం లేదని, వారానికి దాదాపు 2.40 లక్షల నిరుద్యోగ బీమా క్లెయిములు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్వహించిన అధ్యయనంలో దాదాపు సగం మంది అమెరికన్లు నెలసరి జీతాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు వెల్లడైంది. 


Updated Date - 2020-03-24T23:32:39+05:30 IST