‘నిర్భయ’ కేసులో తీహార్ జైలు అధికారులకు కోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-03-18T23:51:29+05:30 IST

తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని కోరుతూ ‘నిర్భయ’ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు చేపట్టింది. డెత్ వారంట్ ప్రకారం...

‘నిర్భయ’ కేసులో తీహార్ జైలు అధికారులకు కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని కోరుతూ ‘నిర్భయ’ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు చేపట్టింది. డెత్ వారంట్ ప్రకారం  ఈ నెల 20న వీరికి తీహార్ జైలులో మరణ శిక్షలు అమలు కావలసి ఉండగా, ఆ జైలు  అధికారులకు, పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. 


రెండో క్షమాభిక్ష పిటిషన్, వివిధ లీగల్ అప్లికేషన్లు, అపీళ్ళు పెండింగ్‌లో  ఉన్నందువల్ల తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని దోసులు ఢిల్లీ కోర్టును కోరారు. 


డెత్ వారంట్ ప్రకారం ఈ నెల 20న ‘నిర్భయ’ దోషులు నలుగురికి తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు కావలసి ఉంది. దోషి అక్షయ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్  దాఖలు చేశాడు. నేరం జరిగిన సమయంలో తాను బాలుడినని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. 


నేరం జరిగినపుడు తాను ఢిల్లీలో లేనని, తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. 


Updated Date - 2020-03-18T23:51:29+05:30 IST