న్యాయవాదికి రూ. 5లక్షల ఫైన్ వేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-10-13T17:54:11+05:30 IST

హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ విద్యార్హతలపై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేసిన లాయర్‌కు రూ.5లక్షల జరిమానా విధించారు. మద్రాసు హైకోర్టులో విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌...

న్యాయవాదికి రూ. 5లక్షల ఫైన్ వేసిన హైకోర్టు

చెన్నై : హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ విద్యార్హతలపై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేసిన లాయర్‌కు రూ.5లక్షల జరిమానా విధించారు. మద్రాసు హైకోర్టులో విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ (న్యాయమూర్తి హోదా)గా పనిచేస్తున్న పూర్ణిమా ప్లస్‌టూ పరీక్షలు రాయకుండానే నేరుగా ఓపెన్‌ యూనివర్శిటీలో డిగ్రీ, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా పొందారని ఆరోపిస్తూ ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని న్యాయవాది సతీష్‌ కుమార్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఏపీ. సాహి విచారణ జరిపారు. ఆ పిటిషన్‌ విచారణకు రాగా హైకోర్టు రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి పూర్ణిమకు సంబంధించిన విద్యార్హత ధ్రువపత్రాలను ఏపీ సాహి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పిటిషనర్‌ సతీష్‌కుమార్‌కు చూపించారు. పూర్ణిమ 1984లో జరిగిన ప్లస్‌టూ పరీక్షల్లో 711 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు విద్యాసంస్థ జారీ చేసిన మార్కుల జాబితాను పిటిషనర్‌కు చూపించారు. న్యాయమూర్తి హోదాలో ఉన్న హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌పై తప్పుడు ఆరోపణలతో పిటిషన్‌ వేసి, న్యాయస్థానం సమయాన్ని దుర్వినియోగపరిచారనే కారణంగా పిటిషనర్‌కు ప్రధాన న్యాయమూర్తి ఏపీ సాహి రూ.5లక్షల జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా పిటిషనర్‌పై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు నమోదు చేసి, ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-10-13T17:54:11+05:30 IST