మోదీ చేతుల్లో దేశం సురక్షితం

ABN , First Publish Date - 2020-03-12T09:47:32+05:30 IST

ప్రధాని మోదీ నాయకత్వం అద్భుతమని, ఆయన చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం ఢిల్లీలో...

మోదీ చేతుల్లో దేశం సురక్షితం

  • ఆయన నాయకత్వం అద్భుతం..
  • జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసలు..
  • నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక 

న్యూఢిల్లీ/భోపాల్‌, మార్చి 11: ప్రధాని మోదీ నాయకత్వం అద్భుతమని, ఆయన చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా బుధవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా నడ్డా బీజేపీ సహ వ్యవస్థాపకురాలు, సింధియా బామ్మ విజయరాజే సింధియాను గుర్తుచేసుకున్నారు. ‘జ్యోతిరాదిత్య సింధియా తన కుటుంబంలోకి వచ్చారు. ఆయనకు స్వాగతం’ అని చెప్పారు. అనంతరం సింధియా మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు మంచి అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండడం వల్ల ప్రజలకు సేవ చేయలేకపోయానని, అది తననెంతగానో బాధించిందని చెప్పారు.


కాంగ్రెస్‌ పార్టీ అపనమ్మకంతో బతుకుతోందని, అది గతంలోలా లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని పొగిడిన సింధియా.. ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు. మధ్యప్రదేశ్‌ విషయానికి వస్తే తన పాత సహచరులతో కలిసి రాష్ట్రం గురించి కన్న కలలన్నీ 18 నెలల్లో కల్లలయ్యాయని చెప్పారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సింధియా పేరును ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు రైల్వే శాఖ దక్కవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


మహరాజ్‌కు స్వాగతం: శివరాజ్‌ 

సింధియాను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. ‘మహరాజ్‌ (సింధియా)కు కాంగ్రె్‌సలో జరిగిన అవమానానికి ఇప్పుడు న్యాయం జరిగింది’ అన్నా రు. ‘‘ఇది బీజేపీకి, వ్యక్తిగతంగా నాకు సంతోషకరమైన రోజు. రాజ కుటుంబం మొత్తం బీజేపీతోనే ఉంది. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయడమే వారి సంప్రదాయం’’ అన్నారు. ‘‘జ్యోతిరాదిత్య తన బామ్మ విజయరాజే సింధియా సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు’’ అని సింధియా అత్త, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-12T09:47:32+05:30 IST