మండలి డిప్యూటీ చైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-30T08:31:51+05:30 IST

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌, జేడీఎస్‌ నేత ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ (63) సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చైర్మన్‌ ప్రతాపచంద్ర

మండలి డిప్యూటీ చైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్య

15న కౌన్సిల్లో జరిగిన ఘటనతో కర్ణాటక కౌన్సిల్‌ ఉప సభాపతి మనస్తాపం

రైలు కింద పడి బలవన్మరణం

యడియూరప్ప, దేవెగౌడ దిగ్ర్భాంతి

సుదీర్ఘ సూసైడ్‌ నోట్‌ లభ్యం

మండలి ఘటన వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడి


బెంగళూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌, జేడీఎస్‌ నేత ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ (63) సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చైర్మన్‌ ప్రతాపచంద్ర శెట్టిపై బీజేపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 15న మండలిలో  రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైర్మన్‌ స్థానంలో కూర్చున్న ధర్మేగౌడను కాంగ్రెస్‌ సభ్యులు బలవంతంగా ఈడ్చి కిందకు లాగేశారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన.. సోమవారం చిక్కమగళూరులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


మధ్యాహ్నం సుఖరాయపట్టణలోని తన ఫాంహౌ్‌సకు చేరుకున్నారు. ప్రభుత్వ కారును, భద్రతా సిబ్బందిని అక్కడే ఉంచి తన ప్రైవేటు శాంట్రో కారులో వ్యక్తిగత డ్రైవర్‌తో దేవనూరు వైపు వెళ్లారు. దేవనూరులోని తన అనుచరుడైన హేమంత్‌కు ఫోన్‌ చేసి అర్జెంటుగా బెంగళూరుకు వెళ్లాలని రైళ్ల సమయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుణసాగర వద్ద మంగేనహళ్ళి వంతెన వద్దకు చేరుకున్నారు. తనకు పని ఉందంటూ డ్రైవర్‌ను అక్కడే ఉండమని.. కారును తానే నడుపుతూ ముందుకెళ్లారు. ఎవరూ తనను గుర్తించకుండా మఫ్లర్‌ కప్పుకొన్నారు. అయినా ఆ సమయంలో అటువైపు స్థానిక రైతు ఒకరు ధర్మేగౌడను పలకరించి ఇంత రాత్రి చలిలో ఇక్కడెందుకు.. ఇంటికి పోదాం రమ్మన్నాడు. ఓ ముఖ్యమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని ధర్మేగౌడ అతడిని పంపేశాడు. కారును రైల్వే ట్రాక్‌ పక్కనే నిలిపి కిత్తూరురాణి చెన్నమ్మ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వస్తుండడాన్ని గమనించి పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మేగౌడ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో డ్రైవర్‌ అదేమార్గంలో వెతుక్కుంటూ వచ్చాడు. సమీపంలో కారును గుర్తించాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఛిద్రమైన శరీరభాగాలను గుర్తించి తీవ్ర షాక్‌కు గురై వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలియగానే జిల్లా కలెక్టర్‌ బగాది గౌతమ్‌, ఎస్పీ అక్షయ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీటీ రవి, ఎమ్మెల్సీ ఎస్‌ఎల్‌ భోజేగౌడ, ఎమ్మెల్యే బెళ్ళి ప్రకాశ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాంతరు వెలుగులోనే తునాతునకలైన శరీర భాగాలను ఒక చోటకు చేర్చి శివమొగ్గ ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలిసి ధర్మేగౌడ అభిమానులు బోరున విలపిస్తూ ఆస్పత్రికి చేరుకున్నారు.


మంగళవారం సాయంత్రం సుఖరాయపట్టణలోని ఆయన ఫాంహౌ్‌సలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ధర్మేగౌడకు భార్య మమత, కుమారుడు సునాల్‌, కుమార్తె ఉన్నా రు. ఆయన సోదరుడు భోజేగౌడ జేడీఎస్‌ ఎమ్మెల్సీ గా ఉన్నారు. ధర్మేగౌడ ఆత్మహత్యపై సీఎం యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమారస్వామి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. 


పంచాయతీ సభ్యుడి నుంచి..

చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సుఖరాయపట్టణకు సమీపంలోని సరపనహళ్ళిలో ధర్మేగౌడ జన్మించారు. కల్లహళ్ళి హోబళి పంచాయతీకి తొలిసారిగా సభ్యుడిగా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం ఇదే పంచాయతీకి అధ్యక్షుడయ్యాడు. తాలూకా ఏపీఎంసీ అధ్యక్షుడిగా, భూ అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడిగా, వ్యవసాయ సేవా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, హాసన్‌ పాల సమాఖ్య అధ్యక్షుడిగా, అపెక్స్‌ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఒకసారి తాలూకా పంచాయతీకి, రెండుసార్లు జిల్లా పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికయ్యా రు. ఇదే జిల్లాలోని బీరూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి ఎస్‌ఆర్‌ లక్ష్మ య్య కూడా ఇదే నియోజకవర్గానికి జనతా పరివార్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. పునర్విభజన సమయం లో బీరూరు నియోజకవర్గం రద్దయిం ది. దేవేగౌడ కుటుంబానికి ఆప్తుడు కావడంతో మండలిలో సభ్యత్వమిచ్చా రు. జేడీఎ్‌స-కాంగ్రెస్‌ సంకీర్ణ సమయంలో డిప్యూటీ చైర్మన్‌ అయ్యారు.


సూసైడ్‌ నోట్‌ దొరికింది 


ధర్మేగౌడ ఆత్మహత్యకు పాల్పడిన రైలు పట్టాల సమీపంలోనే పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది. మండలిలో జరిగిన ఘటన తనను కలచివేసిందని, తీవ్ర వేదనకు లోనయ్యానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ నోట్‌లో కీలకమైన రహస్య సమాచారం ఉందని.. ప్రసుత్తానికి వెల్లడించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ముందు ధర్మేగౌడ సుదీర్ఘమైన సూసైడ్‌ నోట్‌ రాశారని.. ఇందులో తమ కుటుంబ సభ్యులకు ఆస్తి పంపకం వివరాలతోపాటు మరికొంత కీలక సమాచారం కూడా ఉందన్నారు. అంత్యక్రియల్లో యడియూరప్ప, దేవెగౌడ, కుమారస్వామి, సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T08:31:51+05:30 IST