వెంటిలేటర్ల కొనుగోలులోనూ సర్కార్ అవినీతి: డీకే
ABN , First Publish Date - 2020-07-18T22:41:49+05:30 IST
కోవిడ్ వైద్య కొనుగోళ్లలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని కర్ణాటక ప్రబుత్వం అవినీతికి పాల్పడిందంటూ..

బెంగళూరు: కోవిడ్ వైద్య సామగ్రి కొనుగోళ్లలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని కర్ణాటక ప్రబుత్వం అవినీతికి పాల్పడిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మరోసారి విమర్శలు గుప్పించారు. వెంటిలేటర్ల కొనుగోళ్లలో ఈ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం వెంటిలేటర్‌ను రూ.4.78 లక్షలకు కొనుగోలు చేస్తే, కర్ణాటక ప్రభుత్వం రూ.18.20 లక్షలకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడేం వల్లే కర్ణాటకలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
'కరోనా కరప్షన్‌లో మంత్రులు బిజీగా ఉన్నారు. ప్రతి వైద్య సామగ్రి కొనుగోలులోనూ అవినీతి చోటుచేసుకుంటోంది. పీపీఈ కిట్ల నుంచి టెస్ట్ కిట్లు, చివరకు బెడ్‌ల విషయలోనూ అవినీతి జరుగుతోంది. ఆరోగ్య సంక్షోభాన్ని ఒక అవకాశంగా బీజేపీ ప్రభుత్వం మలుచుకుని లూటీ చేస్తోంది' అని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, కర్ణాటకలో ఇంతవరకూ 51,422 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారంనాడు ప్రకటించింది.