ఇదే చివరి సంక్షోభం కాదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-12-27T16:15:14+05:30 IST

కరోనా మహమ్మారి మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇదే చివరి సంక్షోభం కాదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

జెనీవా: కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పర్యావరణ మార్పులను నివారించని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆధోగతి తప్పదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు. ఈ దూరదృష్టి లేమీ ప్రమాదకరమని, అప్పటికప్పుడూ పరిష్కాల కోసం వెతుకులాడకుండా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని కోరారు. కరోనా సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


‘సంక్షోభం సమయాల్లో గాబరా పడటం..పరిస్థితి కుదుటపడ్డాక నిర్లక్ష్యం ప్రదర్శించడటం..గత కొంత కాలం ప్రపంచం మొత్తం ఇదే వైఖరిని అవలంబిస్తోంది. సమస్య తలెత్తినప్పుడల్లా డబ్బు వెదజల్లి పరిష్కరిస్తాం.. ఆ తరువాత పాత ఘటనలను మర్చిపోతాం. మరో సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఏ ప్రయత్నాలూ చేయం. ఇటువంటి వైఖరి చాలా ప్రమాదకరం. ఇలా ఎందుకు జరగుతోందో అర్థం కావట్లేదు. అని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.


‘ఇదే చివరి సంక్షోభం కాదని మనకు చరిత్ర చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి..ఇటువంటి మహమ్మారులు జీవితంలో ఓ భాగం. మావనువులు, జంతువుల, మన ధరిత్రి బాగోగుల మధ్యలోని సంబంధాన్ని కరోనా సుస్పష్టం చేసింది. పర్యావరణ మార్పులను అడ్డుకోని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేసే ప్రయత్నాలన్నీ అధోగతి పాలవుతాయి. భూమిపై బతికేందుకు వీలులేకుండా చేస్తున్న పర్యావరణ మార్పులు..మానవాళి మనుగడనే ప్రశ్నార్థం’ చేస్తున్నాయి అని టెడ్రోస్ హెచ్చరించారు. 

Updated Date - 2020-12-27T16:15:14+05:30 IST