మహారాష్ట్రలో కరోనా వీరంగం

ABN , First Publish Date - 2020-04-12T07:45:00+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 768 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,529కి పెరిగింది.

మహారాష్ట్రలో కరోనా వీరంగం

ఒకే రోజు 187 కేసులు.. 17 మంది మృతి

మైసూరులో ఫార్మా కలకలం.. 1400 మంది క్వారంటైన్‌

20 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌

ఇటీవలే చైనా నుంచి కంపెనీకి ముడిసరుకు దిగుమతి

ఏపీలో ఒకే కుటుంబంలో 11మందికి పాజిటివ్‌

వీరిలో పదేళ్లలోపు చిన్నారులు ఆరుగురు

దేశంలో కేసులు 7529.. మరణాలు 242


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 768 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,529కి పెరిగింది. మరణాల సంఖ్య 242కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచే 187 ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1761కి పెరిగింది. ఇక్కడ కరోనాతో శనివారం ఒక్కరోజే 17 మంది చనిపోయారు. ఢిల్లీలో శనివారం 166 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1069కి పెరిగింది. సెంట్రల్‌ ఢిల్లీలోని చాందినీ మహల్‌ ప్రాంతంలో 102 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 52 మందికి  పాజిటివ్‌ అని తేలింది. వీరంతా ఆ ప్రాంతంలో ఉన్న 13 మసీదుల్లో నివాసం ఉంటున్నారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది ఇటీవల మర్కజ్‌కు వెళ్లివచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.   


మసీదుల్లో ఉన్న 102 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా 139 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో 65 జైపూర్‌ నుంచే నమోదయ్యాయి. బికనేర్‌లో ఒకే ఇంటిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఇప్పటికే ఓ వృద్ధురాలు కొవిడ్‌తో చనిపోయింది. యూపీలో మేరట్‌లోని జలీ కోఠీ ప్రాంతంలో కొవిడ్‌ బాధితున్ని చికిత్స కోసం తీసుకెళ్లడానికి వచ్చిన అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.  మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 451 కేసుల్లో సగానికిపైగా అక్కడే నమోదయ్యాయి. రాష్ట్రంలో సంభవించిన మొత్తం 36 కరోనా మరణాల్లో 27 ఇండోర్‌ నుంచే నమోదయ్యాయి. కేరళలో కొవిడ్‌ చికిత్స పొందుతున్న ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు కూడా వైరస్‌ సోకిందా.. లేదా.. అన్న విషయాన్ని నిర్ధరించుకోవడం కోసం నమూనాలను పరీక్ష కోసం పంపారు. కాగా, కొవిడ్‌ ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్లలో సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి తగిన పోలీసు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలని హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో చెప్పారు. 


కరోనా భయంతో ముగ్గురి ఆత్మహత్య

కరోనా భయంతో మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో నాసిక్‌లో 31 సంవత్సరాల యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు.  కరోనా సోకిన ఓ యువకుడు అకోలా ఆస్పత్రి ఐసొలేషన్‌ వార్డు బాత్రూంలో గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు అరియాలూరులోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 60 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతనికి పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. కానీ ఫలితాలు వచ్చే లోపే అతడు ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. కర్ణాటకలోని హుబ్బళ్లి నగరం ముల్లా ప్రాంతానికి చెందిన కరోనా సోకిన వ్యక్తితో ఐదుగురు కానిస్టేబుళ్లు సన్నిహితంగా మెలిగినట్టు  నిర్ధారణ అయింది.  


ఇంట్లోకి తోలి తాళం వేశారు

ఆ ఊళ్లో చాలా మంది లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం లేదు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన అధికారులు ఎవరిళ్లలో వారిని తోలి బయటి నుంచి తాళం వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పూర్‌ జిల్లా రాజ్‌నగర్‌లో జరిగింది. అందరూ లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తామని చెప్పడంతో అధికారులు తాళాలు తీశారు. ఇంకా 50 ఇళ్లకు తాళాలు అలాగే ఉన్నాయి. వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సిన వాళ్లని, ఆ గడువు ముగిసిన తర్వాత తాళాలు తీస్తామని చెప్పారు.

Updated Date - 2020-04-12T07:45:00+05:30 IST