అగ్రరాజ్యంలో మృత్యుఘోష
ABN , First Publish Date - 2020-04-12T07:07:00+05:30 IST
అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే 2,047 మంది పౌరులు కరోనాకు బలయ్యారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 40 మంది ప్రవాస భారతీయులు మృతిచెందారు.

కరోనా కరాళ నృత్యంతో 24 గంటల్లో 2047 మంది మృతి40 మంది భారతీయులూ తుదిశ్వాస
మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌వాసులు
శనివారం నాటికి 20,042 మంది మృతి
ఇటలీని అధిగమించిన అమెరికా
5 లక్షలు దాటిన కేసుల సంఖ్య
పాజిటివ్ కేసుల్లో ప్రపంచ రికార్డు
చేయాల్సింది చేస్తున్నాం.. ఇక ప్రజల చేతుల్లోనే: అధ్యక్షుడు ట్రంప్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే 2,047 మంది పౌరులు కరోనాకు బలయ్యారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 40 మంది ప్రవాస భారతీయులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన వారు. మరో 1500 మంది భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో పాజిటివ్ నమోదైంది. ఇక, పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ప్రపంచ రికార్డును అధిగమించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,21,042 దాటినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 35 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొవిడ్-19 వ్యాప్తికి న్యూయార్క్ కేంద్రంగా ఉన్నట్టు తెలిపింది. దీని తర్వాత స్థానంలో న్యూజెర్సీ ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనే ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసిస్తుండడం గమనార్హం. అదేవిధంగా న్యూయార్క్‌లోనూ 15 మంది ప్రవాస భారతీయులు కరోనాకు బలయ్యారు. మరో నలుగురు పెన్సిల్వేనియా, ఫ్లోరిడాల్లో మృతి చెందారు. టెక్సాస్, కాలిఫోర్నియాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రికి అందిన లెక్కల ప్రకారం అమెరికాలో 20,042 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో కరోనా మృతుల్లో త్వరలోనే ఇటలీని అమెరికా అధిగమించింది. అయితే, తమ దేశంలో కరోనామృతుల సంఖ్య మొదట్లో అనుకున్న దానికన్నా తగ్గుతుందని, ఇది 60 వేలలోపు ఉండొచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు శ్రమిస్తోందని, ఇక కరోనా పరిష్కారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన ట్రంప్, 50 రాష్ట్రాలను అతి పెద్ద పెనుముప్పు ఉన్నవిగా ప్రకటించారు.ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇంటికేపరిమితం కావాలన్నారు.
దయనీయ అంతిమం!
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో సన్నోవా అనలటికల్ సంస్థ సీఈవో మారేపల్లి హన్మంతరావు కరోనాకు బలయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన హన్మంతరావు అంతిమ సంస్కారాలు అత్యంత దయనీయంగా నిర్వహించాల్సి వచ్చిందని సంస్థ ఉద్యోగులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం కేవలం తొమ్మిది మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో అంతిమ సంస్కారాలను ఆన్‌లైన్ వీడియోలో వీక్షిస్తూ నివాళులర్పించారు. హన్మంతరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్మంతరావు మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) సంతాపం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు
అమెరికాను చుట్టుముడుతున్న కరోనాను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజెర్సీలో కరోనా బాధితులు అధికంగా ఉన్నారు. ఇక్కడ తెలుగువారూ అధికమే. న్యూజర్సీ గవర్నర్ సారధ్యంలో ప్రభుత్వం కరోనా నిరోధానికి ప్రచారం చేపట్టింది. మరణాల సంఖ్య తగ్గించడానికి పరీక్షలు చేపడుతున్నాం. భారతీయులు, తెలుగువారిలో ధైర్యం నింపుతున్నాం.
- చివుకుల ఉపేంద్ర, న్యూజర్సీ రాష్ట్ర కమిషనర్
ఆర్ధికంపై పెను ప్రభావం
నేను కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉంటున్నాను. ఇక్కడి తెలుగువారంతా క్షేమంగానే ఉన్నారు. లాక్ డౌన్‌తో సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా చాలా ఉద్యోగాలు పోయాయి.
- కూచిభొట్ల ఆనంద్, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు
మహాసభలు వాయిదా
అమెరికాలో కరోనా ప్రభావం తెలుగువారిపై పరోక్షంగా పడుతోంది. తెలుగువారి ఉద్యోగాలకు భద్రత కరువైంది. నేను అధ్యక్షునిగా ఉన్న అమెరికా తెలుగు అసోసియేషన్(ఏటీఏ) మహాసభలను డిసెంబరు వరకు వాయిదా వేశాం.
- భీమిరెడ్డి పరమేష్, ఆటా అధ్యక్షులు
భౌతిక దూరమే రక్షరేకు
కరోనాను కట్టడి చేయడానికి అమెరికాలోని వైద్య పరిశోధన కేంద్రాల్లో 24 గంటలూ ప్రయోగాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చోవడమే ప్రస్తుతానికి సరైన మందు. డెట్రాయిట్‌లో కరోనా పేషంట్లకు రాత్రింబవళ్లు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ తెలుగువారు అత్యధికంగా ఉన్నారు.
- పొలిచర్ల హరనాథ్, న్యూరాలజిస్ట్, డెట్రాయిట్
(న్యూయార్క్ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ)