భారత్ @ 100
ABN , First Publish Date - 2020-04-05T06:57:58+05:30 IST
దేశంలో కరోనా మృతుల సంఖ్య మూడంకెల్లోకి మారింది. వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య వందకు చేరింది. శనివారం రికార్డు స్థాయిలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
పాజిటివ్ కేసుల సంఖ్య 3,600కు..
ఒక్క రోజులోనే 600 వరకు పెరుగుదల
మహారాష్ట్రలోనే కొత్తగా 145 కేసులు
ఎంపీలో మహిళా ఐఏఎస్‌కు వైరస్
ఏపీలో మరొకరు మృతి.. 32 కేసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశంలో కరోనా మృతుల సంఖ్య మూడంకెల్లోకి మారింది. వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య వందకు చేరింది. శనివారం రికార్డు స్థాయిలో 600పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,600 దాటాయి. మహారాష్ట్రలో ఆరు మరణాలు సహా 145 కొత్త కేసులు రికార్డులకెక్కాయి. మొత్తం కేసులు పెరిగి 635కు చేరగా.. ఉత్తరప్రదేశ్‌లో 53 కేసులు పెరిగి 227 అయ్యాయి. శనివారం పదిమంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 75 మంది మృతి చెందారని, పాజిటివ్ కేసుల సంఖ్య 3,072 అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 30 శాతం కేసులు (1,032) తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవేనని పేర్కొంది. ఆ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొన్నవారితో పాటు వారిని కలిసిన 22 వేల మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపింది. 211 జిల్లాల్లో కరోనా కేసులు ఉద్భవిస్తున్నాయనిఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. లద్దాఖ్‌లో మొత్తం 14 మంది బాధితులకు 9 మంది వ్యాధి నయమైంది. ఢిల్లీలో కేసులు 445కు చేరాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సైతం వైర్‌సకు గురయ్యారు. సీఆర్పీఎ్ఫలో పనిచేసే వైద్యుడు ఒకరు కరోనాకు గురవడంతో సంస్థ డైరెక్టర్ జనరల్ మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు.
కర్ణాటకలో వృద్ధుడి మృతి
కర్ణాటకలో శనివారం 16 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 144కు చేరింది. బాగల్కోట్కు చెందిన వృద్ధుడి (70) మృతితో రాష్ట్రంలో నలుగురు మరణించినట్లైంది. ఢిల్లీలో మర్కజ్‌కు హాజరై క్వారంటైన్ కానివారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన యువతి (25) ద్వారా ఆమె తండ్రికి, వారి ఇంటి పనిమనిషికి వైరస్ సోకింది. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 485కి చేరింది. శనివారం ఇద్దరు మరణించారు. మరో 74 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 73 మంది ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారే. రాష్ట్రంలోని మొత్తం బాధితుల్లో 422 మంది ఢిల్లీ నుంచి తిరిగొచ్చినవారేనని ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు.