కొవిడ్-19తో ఓ రోగి మృతి... దేశంలో 11కు చేరిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2020-03-25T11:59:04+05:30 IST
కొవిడ్-19 వ్యాధితో తమిళనాడు రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ రోగి మరణించారు.....

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాధితో తమిళనాడు రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ రోగి మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న రోగికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని చెన్నైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా బుధవారం తెల్లవారుజామున మరణించారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్ చెప్పారు. మరణించిన రోగి స్టెరాయిడ్స్ వాడుతున్నారని మంత్రి ట్వీట్ చేశారు. దీంతో దేశంలో కొవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 11 కు చేరింది.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన మరో ముగ్గురు రోగులు ఆసుపత్రుల్లో చేరారని మంత్రి విజయభాస్కర్ చెప్పారు. న్యూజీలాండ్ నుంచి వచ్చిన 65 ఏళ్ల వృద్ధుడు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, 55 ఏళ్ల వయసు గల మరో మహిళ కిల్పాక్ వైద్యకళాశాలలో, లండన్ నుంచి వచ్చిన మరో 25 ఏళ్ల యువకుడు రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరారని వైద్యశాఖ మంత్రి వెల్లడించారు.మంగళవారం కరోనా వైరస్ తో 50 మంది ఆసుపత్రుల్లో చేరగా, బుధవారం ఓ రోగి మరణించారు.