కోవిడ్-19: ప్రపంచ వ్యాప్తంగా 75 వేలు దాటిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-04-08T00:20:29+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్-19 కారణంగా మృతి చెందిన వారి సంఖ్య...

కోవిడ్-19: ప్రపంచ వ్యాప్తంగా 75 వేలు దాటిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 75 వేలు దాటినట్టు ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌ కేంద్రంగా వెలుగుచూసిన ఈ మహమ్మారి కారణంగా ఐరోపాలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 75,558 కరోనా మరణాలు నమోదు కాగా.. ఒక్క ఐరోపా ఖండంలోనే 53,928 మంది చనిపోయారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలు మాత్రమే. దాదాపు చాలా దేశాల్లో అత్యంత తీవ్రమైన కేసుల్లోనే ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుపుతున్నారు.


కాగా ఫిబ్రవరి చివరిలో తొలి కరోనా మరణం నమోదైన ఇటలీలో ఇప్పటివరకు అత్యధికంగా 16,523 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 13, 798 మంది, అమెరికాలో 10,993 మంది, ఫ్రాన్స్‌లో 8,911 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 13.5 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. ఒక్క ఐరోపాలోనే 7 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అమెరికా, కెనడా వ్యాప్తంగా 3.8 లక్షలు, ఆసియాలో 1.22 లక్షల మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. 

Updated Date - 2020-04-08T00:20:29+05:30 IST