అలా చేస్తే.. జూన్ తర్వాత కరోనా కనిపించదు: చైనా

ABN , First Publish Date - 2020-03-13T03:38:21+05:30 IST

దేశాలన్నీ కలిసి కరోనా మహమ్మారిపై పోరాడితే జూన్ తర్వాత ఈ మహ్మమ్మారి అంతం అవుతుందని చైనాకు చెందిన

అలా చేస్తే.. జూన్ తర్వాత కరోనా కనిపించదు: చైనా

బీజింగ్: దేశాలన్నీ కలిసి కరోనా మహమ్మారిపై పోరాడితే జూన్ తర్వాత ఈ ప్రాణాంతక వైరస్ అంతం అవుతుందని చైనాకు చెందిన సీనియర్ మెడికల్ అడ్వైజర్ ఒకరు తెలిపారు. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన హుబేయి ప్రావిన్స్‌లో కొత్త కేసుల నమోదు ఇప్పుడు తొలిసారి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో రెండింట మూడొంతులు సెంట్రల్ హుబేయి ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు ఇక్కడ కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. అయితే, ఇప్పుడు చైనా వెలుపల ఈ వైరస్ విజృంభిస్తోంది.


ఈ విషయంలో అధికారులు చేసిన కృషి ఎనలేనిది. హుబేయిని దిగ్బంధించడంతో ఇతర నగరాలకు వైరస్ వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో ఇతర దేశాలు తమను ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ‘‘మొత్తంమీద ఇదొక అంటువ్యాధి. ఇది చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు కొత్త కేసుల నమోదు గణనీయంగా పడిపోయింది’ అని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ అన్నారు. 


ప్రభుత్వ సీనియర్ మెడికల్ అడ్వైజర్ ఝోంగ్ నాన్షన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించి కట్టడికి చర్యలు తీసుకునే వరకు ఇది విస్తరిస్తూనే ఉంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచలను అన్ని దేశాలు పాటించాలని సలహా ఇచ్చారు. దేశాలన్నీ కలిసికట్టుగా దీనిపై పోరాడితే జూన్ నాటికి వైరస్ కథ ముగిసిపోతుందని నాన్షన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-13T03:38:21+05:30 IST