‘సెప్సిస్’ ఔషధంతో కరోనా కట్టడి!
ABN , First Publish Date - 2020-04-21T09:18:09+05:30 IST
కరోనాను నిలువరించే ఔషధాలను కనుగొనే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. సెప్సిస్ రోగుల

ప్రయోగ పరీక్షలకు సీఎస్‌ఐఆర్ సిద్ధం.. ఆస్పత్రులతో ఒప్పందాలు
నాచులాంటి పదార్థాలతో కరోనా మందు తయారీపైనా దృష్టి
న్యూఢిల్లీ/పనాజీ, ఏప్రిల్ 20 : కరోనాను నిలువరించే ఔషధాలను కనుగొనే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. సెప్సిస్ రోగుల చికిత్సకు వాడే ‘హీట్ కిల్డ్ మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ’ అనే యాంటీ బ్యాక్టీరియల్‌తో కూడిన మందుతో కరోనా రోగులపై ప్రయోగ పరీక్షలకు శాస్త్ర,పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎ్‌సఐఆర్) సిద్ధమైంది. ఇందుకోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి పొందడంతో పాటు క్లినికల్ ట్రయల్స్ కోసం పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కరోనా ఇన్ఫెక్షన్ బారినపడిన ఆరోగ్య సిబ్బంది, రోగుల సన్నిహితులపైనా ఈ మందు ప్రభావాన్ని పరీక్షించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సీఎ్‌సఐఆర్ నియమించే ప్రత్యేక కమిటీ పర్యవేక్షించనుంది. అయితే ఈ ట్రయల్స్‌లో వాడనున్న ఔషధాన్ని దేశంలో విక్రయించేందుకు ఇటీవలే అన్ని అనుమతులూ లభించాయి. ఈ మందును అహ్మదాబాద్‌కు చెందిన క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ‘సెప్సివ్యాక్’ పేరిట మార్కెట్లో అందుబాటులోకి తేనుంది.
సెప్సిస్ అనేది ప్రాణాంతకమైంది. సాధారణంగా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు , దానికి కారణమయ్యే వైర్‌సలు/బ్యాక్టీరియాలతో పోరాడేందుకు రక్తంలోకి కొన్ని రసాయనాలను విడుదలచేస్తాయి. ఈ రసాయనాలకు కూడా మన శరీరం స్పందించని జడ స్థితిని సెప్సిస్ అంటారు. ఇదే జరిగితే శరీరంలోని అవయవాల పనితీరు మందగించి మరణానికీ దారితీస్తుంది. ఇటువంటి స్థితిలో కొట్టుమిట్టాడే ఎంతోమంది ‘గ్రామ్ నెగెటివ్ - సెప్సిస్’ రోగుల ప్రాణాలను నిలపడంలో సీఎ్‌సఐఆర్ అభివృద్ధిచేసిన ‘హీట్ కిల్డ్ మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ’ సహిత ఔషధం కీలకపాత్ర పోషించింది. కరోనా రోగుల ప్రాణాలు నిలిపేందుకూ అది పనికి వస్తుందేమోననే కోటి ఆశలతో ప్రయోగ పరీక్షలకు సిద్ధమవుతోంది. కరోనా విరుగుడు కోసం సముద్ర గర్భంలోనూ వెతికేందుకు భారత్ రంగం సిద్ధం చేస్తోంది. సీఎ్‌సఐఆర్‌కి అనుబంధంగా గోవా నుంచి పనిచేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ(ఎన్‌ఐఓ) ఈ దిశగా అడుగులు వేస్తోంది.
సముద్రాల్లో లభ్యమయ్యే నాచు లాంటి జీవక్రియాశీల పదార్థాల నుంచి కొవిడ్-19 వైర్‌సను నిర్వీర్యం చేసే ఔషధాల తయారీకి ఉన్న అవకాశాలపై ఓ నివేదికను సీఎ్‌సఐఆర్‌కు ఎన్‌ఐఓ సమర్పించింది. ఈవివరాలను ఎన్‌ఐఓ డైరెక్టర్ సునీల్‌కుమార్ ధ్రువీకరించారు. ‘ఇంతకుముందు మేం సముద్రం నుంచి సేకరించిన పలు జీవక్రియాశీల పదార్థాల్లో మలేరియా, ఇతరత్రా వైరల్ వ్యాధులను కట్టడిచేసే గుణాలు ఉన్నట్లు వెల్లడైంది. వాటిలో కరోనాను నిర్వీర్యం చేసే గుణాలు కూడా ఉండొచ్చనేది మా ఆశాభావం. ఈమేరకు మా ప్రతిపాదనను సీఎ్‌సఐఆర్‌కు పంపాం. త్వరలోనే దానిపై పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు నివేదికను కూడా సమర్పిస్తాం’ అని సునీల్ వివరించారు.