కరోనా బాధితుల్లో మహిళలు 24 శాతమే
ABN , First Publish Date - 2020-04-07T07:23:21+05:30 IST
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,778కు చేరింది. 24 గంటల్లో 704 కేసులు పెరిగాయి. ఇదే వ్యవధిలో 28 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలోనే 21 సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 129కు...

- దేశంలో 4,778కు పెరిగిన కరోనా కేసులు
- మృతుల్లో 63 శాతం 60 ఏళ్లు దాటిన వారే
- భారత్‌లో 2, 3 దశల మధ్య కొవిడ్-19
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,778కు చేరింది. 24 గంటల్లో 704 కేసులు పెరిగాయి. ఇదే వ్యవధిలో 28 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలోనే 21 సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 129కు చేరింది. సుమారు 318 మంది వైరస్ బాధితులు కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3,851గా ఉంది. ఈ వివరాలను సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా సోకిన వారిలో 76 శాతం పురుషులు, 24 శాతం మహిళలు ఉన్నారని చెప్పారు.
‘‘మృతుల్లో 63 శాతం 60 ఏళ్లకు పైబడినవారు. 30 శాతం 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు. 7 శాతం 40 ఏళ్లలోపు వారు’’ అని వివరించారు. వయసు గ్రూపు ఆధారంగా కరోనా పేషెంట్ల సంఖ్యను పరిశీలిస్తే 21-40 వయస్కులు అత్యధికంగా 42 శాతం ఉన్నారని చెప్పారు. 41-60 ఏళ్లలోపు వారు 33 శాతం, 60 ఏళ్లు పైబడినవారు 17 శాతం, 20 ఏళ్లలోపు వారు 9 శాతం ఉన్నారని తెలిపారు. మహమ్మారి 2, 3 దశల మధ్య భారత్ ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు లవ్ అగర్వాల్ బుదలిచ్చారు. మృతుల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా 52కు చేరింది. కరోనా కేసులు అత్యధికంగా (781) నమోదైనది కూడా ఈ రాష్ట్రంలోనే! మహారాష్ట్ర తర్వాత రెండు స్థానాల్లో తమిళనాడు (571), ఢిల్లీ (503) ఉన్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం రాష్ట్రంలో తాజాగా 16 కేసులు నమోదవగా, 11 అహ్మదాబాద్‌వే! వీరిలో 9మందికి తబ్లీగీ జమాత్‌తో సంబంధం ఉంది. రాజస్థాన్‌లోని కోటలో కరోనా సోకి 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ తొలి కరోనా మరణం నమోదయింది. ముంబైలోని వాఖడ్ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులకు కొవిడ్-19 సోకింది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆస్పత్రిని మూసివేశారు.
ఉమ్మితే హత్యాయత్నం కేసు
సిమ్లా: కరోనా రోగులు ఎవరైనా ఇతరులపై ఉమ్మి వేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ డీజీపీ సీతారాం మర్దీ తీవ్రంగా హెచ్చరించారు. రోగి చర్య వల్ల బాధితుడికి కరోనా సోకి మరణిస్తే హత్య కేసుగా మారుస్తామని స్పష్టం చేశారు.
14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తామని చెప్పలేం: ఏసీఎస్
లఖ్‌నవు: ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు 300 దాటడంతో ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని చెప్పలేమని ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అవనీశ్ కుమార్ అవస్థీ అన్నారు.
14 నెలల చిన్నారికి కరోనా
గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాకు చెందిన 14 నెలల బాబుకు కరోనా సోకినట్లు ఆదివారం అందిన రిపోర్టుల్లో తేలింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూలీలు. కరోనా ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారు లు ఉన్నారు. ఆ కుటుంబం నివసించే దరేడ్ గ్రామాన్ని దిగ్బంధించా రు. చిన్నారికి ప్రస్తుతం వెంటిలేటర్‌తో శ్వాస అందిస్తున్నారు.