జలుబులా.. కరోనా !?

ABN , First Publish Date - 2020-10-28T07:50:58+05:30 IST

వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు...

జలుబులా.. కరోనా !?

  • సీజనల్‌ ఇన్ఫెక్షన్‌లా వ్యాప్తి 
  • 6 నుంచి 12 నెలలకోసారి సోకే అవకాశం
  • యాంటీబాడీల రక్షణ స్వల్పకాలికమే: బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌, అక్టోబరు 27 : వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు.  ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్‌ కరోనా వైర్‌సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా వైరస్‌ రకానికీ (కొవిడ్‌- 19) మనిషి శరీరం.. అదే తరహాలో స్పందించే అవకాశం ఉందని బార్క్‌లే వ్యాఖ్యానించారు.


ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఆధ్వర్యంలో బ్రిటన్‌లోని 3.65 లక్షల మందికిపైగా ప్రజలకు నిర్వహించిన ఫింగర్‌ ప్రిక్‌ యాంటీబాడీ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ టెస్టులు చేయించుకున్న మెజారిటీ ప్రజల్లో కరోనాను తిప్పికొట్టే యాంటీబాడీలు కొన్ని నెలల పాటే క్రియాశీలంగా ఉన్నాయని గుర్తించారు. ఈ టెస్టుల్లో ‘పాజిటివ్‌’ వచ్చిన వారిలో.. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో (నాలుగు నెలల్లో) యాంటీబాడీలు 26 శాతం మేర తగ్గిపోయాయి. 75 ఏళ్లకు పైబడిన వారి లో యాంటీబాడీల క్షీణత అత్యధికంగా జరిగినట్లు తేలింది. కరోనా సోకి, తగ్గిపోయిందని గుర్తించలేకపోయిన వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గుముఖం పట్టగా, ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ అయిన వారిలో 22.3 శాతం యాంటీబాడీల సంఖ్య పడిపోయింది. 


Updated Date - 2020-10-28T07:50:58+05:30 IST