తొలి కేసు నమోదుకు 2 నెలల ముందే ఇటలీలో కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-06-20T03:09:19+05:30 IST

ఇటలీలో వ్యర్థ జలాల అధ్యయనం అవాక్కయ్యే అంశాన్ని వెలుగులోకి తెచ్చింది

తొలి కేసు నమోదుకు 2 నెలల ముందే ఇటలీలో కరోనా వైరస్

రోమ్ : ఇటలీలో వ్యర్థ జలాల అధ్యయనం అవాక్కయ్యే అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, ఇటలీలో తొలి నోవల్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవడానికి దాదాపు రెండు నెలల ముందే ఈ వైరస్ తిష్ఠ వేసింది. ఉత్తర ఇటలీలోని రెండు ప్రధాన నగరాల్లో ఈ వైరస్ జాడలు కనిపించాయి.


దీనినిబట్టి తెలిసేది ఏమిటంటే, చైనాలో ఈ వైరస్ కనిపించినపుడే, ఇటలీలో కూడా ఇది ఉంది. ఇటలీలో తొలి నోవల్ కరోనా వైరస్ ఫిబ్రవరి రెండో వారంలో నమోదైంది. అయితే గత ఏడాది డిసెంబరులోనే ఉత్తర ఇటలీలోని రెండు ప్రధాన నగరాల్లో ఈ వైరస్ జాడలు కనిపించాయని ఐఎస్ఎస్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. గత ఏడాది చివర్లో మిలన్, ట్యురిన్‌లలోని వ్యర్థ జలాలను పరీక్షించినపుడు సార్స్-కోవ్-2 జన్యు సంబంధ జాడలను గుర్తించినట్లు తెలిపింది. ఇటలీలో ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం గురించి అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని పేర్కొంది. 


మిలన్, ట్యురిన్‌లలోని వ్యర్థ జలాలను 2019 డిసెంబరు 18న, బొలోగ్నాలోని వ్యర్థ జలాలను 2020 జనవరి 29న సేకరించి, పరీక్షించినట్లు పేర్కొంది. 2019 అక్టోబరు, నవంబరు నెలల్లో సేకరించిన వ్యర్థ జలాల్లో ఈ వైరస్ నెగెటివ్ అని నిర్థరణ అయిందని వివరించింది. 


Updated Date - 2020-06-20T03:09:19+05:30 IST