మన దేశంలో 1.24 కోట్ల కరోనా యోధులు సిద్ధం : కేంద్రం

ABN , First Publish Date - 2020-04-22T01:51:21+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై మరింత బలంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం

మన దేశంలో 1.24 కోట్ల కరోనా యోధులు సిద్ధం : కేంద్రం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై మరింత బలంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. covidwarriors.gov.in పోర్టల్ ద్వారా దేశంలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు, స్వచ్ఛంద సేవకుల వివరాలను సేకరించి, విస్తృత సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. 


కోవిడ్-19 సంబంధిత కార్యకలాపాల కోసం మానవ వనరులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సాధికార బృందం-4 చైర్మన్ అరుణ్ కుమార్ పాండా మంగళవారం మాట్లాడుతూ   ఆరోగ్య సంరక్షణ నిపుణులు, స్వచ్ఛంద సేవకుల వివరాలతో covidwarriors.gov.in పోర్టల్‌లో మాస్టర్ డేటాబేస్‌ను రూపొందించామని చెప్పారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.24 కోట్ల మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరంతా వివిధ సేవలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  


550 జిల్లాల్లో 40 వేల మంది ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్లు కరోనా యోధులుగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 500 మంది ఎన్‌సీసీ సిబ్బంది, అదనంగా మరొక 47,000 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. 1.80 లక్షల మంది మాజీ సైనికులను గుర్తించామన్నారు. ఇప్పటికే 6,300 మందిని కార్యరంగంలో ప్రవేశపెట్టామని తెలిపారు.


కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌ కోసం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 15,000 మంది ఆయుష్ ప్రొఫెషనల్స్‌ను నియమించినట్లు తెలిపారు. అదనంగా ఒక లక్షకు పైగా ఆయుష్ ప్రొఫెషనల్స్, 55,000 మంది ఆయుష్ స్టూడెంట్స్‌కు శిక్షణ ఇచ్చామని, వీరంతా ఈ మహమ్మారిపై పోరుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పరిపాలనా యంత్రాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


20 విభాగాలు, 49 ఉప విభాగాల్లో సేవలందించేవారి వివరాలను ఈ పోర్టల్‌లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో సమన్వయకర్తల ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. 201 పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌పైజెస్‌కు సంబంధించిన ఆసుపత్రులు, 49 ఈఎస్ఐఎస్ ఆసుపత్రులు, 50 రైల్వే ఆసుపత్రులు, 12 పోర్టు ఆసుపత్రులు, 13 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఆసుపత్రుల వివరాలను పొందుపరిచామన్నారు. 


కోవిడ్-19పై పోరాడే యోధులకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ పోర్టల్‌లో ఉన్నట్లు తెలిపారు.


Updated Date - 2020-04-22T01:51:21+05:30 IST