బోరిస్‌కు వైరస్‌

ABN , First Publish Date - 2020-03-28T06:59:14+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యాలను కదిపి కుదిపేస్తోంది. తొలిసారిగా ఓ అగ్రరాజ్యాధిపతి ఈ వైరస్‌ బారిన పడ్డాడు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(55)..

బోరిస్‌కు వైరస్‌

స్వీయ ఏకాంతానికి బ్రిటన్‌ ప్రధాని

వైరస్‌ సోకిన తొలి అగ్రరాజ్యాధిపతి

దేశ ఆరోగ్యమంత్రికీ సోకిన మహమ్మారి

ఇప్పటికే ప్రిన్స్‌ చార్లె్‌సకు వైరస్‌

తాత్కాలిక ప్రధాని రేసులో డొమినిక్‌ రాబ్‌!


లండన్‌, మార్చి 27: ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యాలను కదిపి కుదిపేస్తోంది. తొలిసారిగా ఓ అగ్రరాజ్యాధిపతి ఈ వైరస్‌ బారిన పడ్డాడు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(55) కు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘‘గురువారం మధ్యాహ్నం నాకుస్వల్పంగా ఈ లక్షణాలు కనిపించాయి. జ్వరం, దగ్గు వచ్చాయి. చెక్‌ చేయించుకోవాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ విటీ కోరారు. స్వల్పంగానే ఉంది కదా... అని కాసేపు వాదించాను. కానీ ఆయన పట్టుబట్టారు. వెంటనే ఎన్‌హెచ్‌ఎస్‌ (జాతీయ ఆరోగ్య సేవల) సిబ్బంది నన్ను పరీక్షించారు. నిన్న అర్ధరాత్రి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయాను. అయితే నేను కరోనాపై దేశవ్యాప్తంగా సాగిస్తున్న యుద్ధాన్ని కొనసాగిస్తాను. ఏకాంతంలో ఉంటూనే, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీనికి నేతృత్వం వహిస్తాను’’ అని జాన్సన్‌ దేశప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఓ వీడియో సందేశంలో వివరించారు. జాన్సన్‌ను వారం రోజుల పాటు ఏకాంతంగా ఉంచి తరువాత మళ్లీ పరీక్షిస్తారు. ప్రస్తుతం ఆయనను డౌనింగ్‌ స్ట్రీట్‌లోని 11వ నెంబర్‌ ఫ్లాట్‌లో (అంటే సొంత ఫ్లాట్‌లో) ఉంచారు. 10, 12 భవనాలను పూర్తిగా మూసేశారు.


ఆయన భార్య కేరీ సైమండ్స్‌ ప్రస్తుతం గర్భిణి. ఆమె కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆమె కూడా 14 రోజుల పాటు భర్త వద్దకు వెళ్లరాదు. జాన్సన్‌కు ఆహారాన్ని కూడా మనుషుల ద్వారా అందించడం లేదని, ఆయన రూమ్‌ బయట విడిచిపెడుతున్నారని, ఇతర అవసరాలకూ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలియజేశారు.  (ప్రకటించినట్లుగానే ఆయన శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. జూమ్‌ టెక్నాలజీ ద్వారా అందరితో సంభాషించి కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపారు. అనంతరం జరిపిన ఓ సమావేశంలో ఆర్థికమంత్రి శౌనక్‌, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కాగా, బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాంకాక్‌కు కూడా వైరస్‌ సోకింది. తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ఆయన కూడా ప్రకటించారు. ‘నాకు స్వల్ప లక్షణాలే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాను..’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 


రాబ్‌కు ప్రధాని బాధ్యతలు?

బ్రిటన్‌ యువరాజు ఛార్లె్‌సకు ఇప్పటికే కరోనా సోకింది. ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైరస్‌ లేకపోయినా రాణి ఎలిజిబెత్‌ కూడా ఏకాంతంలో ఉన్నారు. బోరిస్‌ జాన్సన్‌ కూడా వైరస్‌ బారిన పడ్డ తరుణంలో కీలక రాజ్యాంగాధిపతులిద్దరూ అధికార విఽధులకు దూరంగా ఉన్న ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఒకవేళ జాన్సన్‌కు వైరస్‌ తగ్గుముఖం పట్టక, ఇంకా నీరసంగా ఉండి, అధికార బాధ్యతలు నిర్వర్తించలేనపుడు ఎవరికి నిర్వహణ బాధ్యతలప్పగిస్తారనేది ఇపుడు చర్చనీయాంశమైంది. అలాంటి స్థితే వస్తే జాన్సన్‌ వారసుడిగా విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌కు అవకాశం లభిస్తుందంటున్నారు. సాధారణంగా అమెరికా మాదిరి డిప్యూటీ నేతలెవరూ బ్రిటన్‌లో ఉండరు. కన్సర్వేటివ్‌ పార్టీ కూడా ఉప నేతలెవరినీ లాంఛనంగా ప్రకటించదు. అయితే ప్రధాని మంచాన పడితే ఎవరో ఒకరికి బాఽధ్యతలప్పగించాలి కాబట్టి ఆ పదవికి ఓ సీనియర్‌ మంత్రిని నియమిస్తారు. డొమినిక్‌ రాబ్‌ ఇప్పటికే డెజిగ్నేటెడ్‌ పీఎంగా ప్రచారంలోకొచ్చారు. బోరిస్‌ జాన్సన్‌ టాప్‌ టీమ్‌లో రాబ్‌ కూడా ఉన్నారు. భూ, స్తిరాస్తి వ్యవహారాలకు ఇన్‌ఛార్జి అయిన డచీ ఆఫ్‌ లాంకేస్టర్‌ - మైఖేల్‌ గోవ్‌ కూడా ఈ టాప్‌ టీమ్‌లో ఉన్నారు. గోవ్‌కు ప్రధాని బాధ్యతలు అప్పగించాలని కేబినెట్లో కొందరు మంత్రులు కోరుకుంటున్నట్లు టైమ్స్‌ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. కాగా, బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా  పెరగుతోంది. తాజా లెక్కల ప్రకారం అక్కడ బాధితుల సంఖ్య 12,000కు చేరువలో ఉంది. ఇప్పటివరకూ 580 మంది మరణించారు.

Updated Date - 2020-03-28T06:59:14+05:30 IST