కరోనా వైరస్ ముప్పు : కేంద్రం సలహాను ధిక్కరించిన మమత బెనర్జీ

ABN , First Publish Date - 2020-03-13T21:05:41+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పట్టించుకోలేదు.

కరోనా వైరస్ ముప్పు : కేంద్రం సలహాను ధిక్కరించిన మమత బెనర్జీ

కోల్‌కతా : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ పట్టించుకోలేదు. ప్రజలు సామూహికంగా ఒక చోట కూడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గురువారం సలహా ఇచ్చింది. కానీ మమత బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలోని అతి పెద్ద ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రభుత్వ క్రీడా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 


మమత తీరును పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఆమె బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టాయి. 


ఇదిలావుండగా, మమత ఈ కార్యక్రమం జరిగిన నేతాజీ ఇండోర్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వం పంపిన సలహాను చదివి వినిపించారు. ప్రజల సమవేశాలు, క్రీడా కార్యక్రమాలతో సహా జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయన్నారు. అయితే ఇలాంటి రోజులు నిత్యం రావని, అందుకే మనమంతా ఇక్కడ సమావేశమయ్యామని చెప్పారు. 


కరోనా వైరస్ ముప్పు నుంచి ఏ విధంగా రక్షణ పొందాలో మమత చెప్పారు. ఒకట్రెండు నెలలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జన సమ్మర్థం కల ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కొంత కాలంపాటు కరచాలనం బదులు నమస్కారం చేయాలని తెలిపారు. మన ఎదురుగా సంభాషించే వ్యక్తికి దూరంగా ఉండాలన్నారు. 


ఈ స్టేడియంలో 12,000 సీట్లు ఉన్నాయని, దాదాపు 10,000 మంది హాజరయ్యారని రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల స్పోర్ట్స్ క్లబ్‌లకు నిధుల పంపిణీ, ప్రముఖ క్రీడాకారులను అభినందించడం, పురస్కారాలను ప్రదానం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-03-13T21:05:41+05:30 IST