కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన భారత్

ABN , First Publish Date - 2020-06-06T19:03:09+05:30 IST

కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన భారత్

కరోనా కేసుల్లో ఇటలీని దాటేసిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో ఇటలీని ఇండియా దాటేసింది. ప్రపంచంలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు రోగుల సంఖ్యలో ఇటలీని ఇండియా దాటేసింది. గడిచిన 24గంటల్లో భారత్‌లో 9,887 కేసులు నమోదు అయ్యాయి. 294 మరణాలు సంభవించాయి. ఈరోజు కొత్తగా 473 మందికి వైరస్ సోకినట్లుగా గుర్తించారు. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,36,675కు చేరుకుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇప్పటి వరకు ఆరోస్థానంలో ఉన్న ఇటలీని వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానానికి ఎగబాకింది. ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య 2,34,531గా ఉంది.


ఇక మన దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,942 కాగా 1,14,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరుకుంది. దేశంలోని మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య 80,229కి చేరింది. 35 మంది కోలుకోగా 72వేలకు పైగా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 2,849గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.


మహారాష్ట్ర తర్వాత ప్రతీ రోజు దేశ రాజధానిలోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ 26,334 మందికి వైరస్ సోకగా, 708 కరోనా మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య 1190కి చేరుకుంది. ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 5 గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో కార్యాలయాన్ని మూసివేశారు. శానిటైజేషన్ చర్యల అనంతరం రేపు తిరిగి తెరవనున్నారు. అటు గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ సముద్ర తీరంలో భారత నావికాదళంలో శిక్షణ పొందుతున్న 16మందికి కరోనా వైరస్ సోకింది. దాంతో వారిని జామ్‌నగర్ మిలట్రీ ఆస్పత్రికి తరలించారు. నావికాదళంలోని మిగిలిన ఉద్యోగులను కూడా ముందు జాగ్రత్త చర్యగా హోంక్వారంటైన్ చేశారు. 

Updated Date - 2020-06-06T19:03:09+05:30 IST