తల్లి నుంచి బిడ్డకు కరోనా వస్తుందా? పరిశోధకులు ఏమంటున్నారంటే..
ABN , First Publish Date - 2020-03-16T20:02:47+05:30 IST
కరోనా సోకిన మహిళలకు పుట్టే బిడ్డలు ఈ వైరస్ బారిన పడే అవకాశం లేదని చైనాకు చెందిన ఓ యూనివర్శీటి జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
వుహాన్: కరోనా సోకిన మహిళలకు పుట్టే బిడ్డలు ఈ వైరస్ బారిన పడే అవకాశం లేదని చైనాకు చెందిన ఓ యూనివర్శీటి జరిపిన పరిశోధనలో వెల్లడైంది. వుహాన్‌లోని హువాజాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైసెస్.. ఈ పరిశోధన చేసింది. వ్యాధికి కేంద్రస్థానమైన వుహాన్‌లో గర్భంతో ఉన్న నలుగురు మహిళలను పరిశీలించిన మీదట యూనివర్శిటీ ఈ అంచనాకు వచ్చింది. ఈ నలుగురు మహిళలూ యూనివర్శిటీ ఆధీనంలో ఉన్న ఆసుపత్రిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే తల్లులకు కరోనా వుండటంతో వైద్యులు వెంటనే శిశువులను ఐసోలేష్‌న్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో ఓ శిశువుకు తొలుత రాషెస్ వచ్చినప్పటికీ వాతంటతవే సద్దుమణిగాయి.
ఈ ఘటన మినహా నలుగురు పిల్లలెవరిలోనూ కరోనా వ్యాధి లక్షణాలు కనిపించలేదు. ఈ క్రమంలో ముగ్గురు శిశువులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా వారికి వైరస్ సోకలేదని తేలింది. ఒకరికి మాత్రం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తల్లి అంగీకరించలేదు. అయితే నలుగురు పిల్లలూ పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో.. తల్లుల ద్వారా పిల్లలకు కరోనా సోకే అవకాశం లేదని యూనివర్శీటీ పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.
అయితే కరోనా బారిన పడ్డ తల్లుల ద్వారా బిడ్డలు ఈ వైరస్ బారిన పడే అవకాశం లేదని చైనా పరిశోధకులు గతంలో ఓసారి ప్రకటించారు. తాజా పరిశోధన ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్టైంది. కాగా.. బ్రిటన్‌లో అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు కరోనా వైరస్ సోకడంతో..అక్కడి వైద్యులు బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శిశువుకు గర్భంలోనే ఉండగా కరోనా సోకిందా లేక ప్రసవం సమయంలోనా లేదా వేరే మార్గంలోనా అనే ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో తలమునకలై ఉన్నారు.