పదిహేను రోజుల తరవాత వచ్చి పది నిమిషాలు గడిపాడు
ABN , First Publish Date - 2020-04-05T05:52:06+05:30 IST
కరోనా కట్టడిలో డాక్టర్లు, ఇతర పారామెడకల్ సిబ్బంది అలుపెరుగని కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధితులను రక్షిస్తున్నారు. అందుకోసం తమ కుటుంబాలకు సైతం...

చండీగఢ్, ఏప్రిల్ 4: కరోనా కట్టడిలో డాక్టర్లు, ఇతర పారామెడకల్ సిబ్బంది అలుపెరుగని కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధితులను రక్షిస్తున్నారు. అందుకోసం తమ కుటుంబాలకు సైతం దూరంగా రోజులు, వారాల తరబడి ఆసుపత్రుల్లోనే రోగుల సేవలో గడిపేస్తున్నారు. అలాంటి వైద్యులకు సంబంధించి హృదయాన్ని చలింపజేసే సంఘటన ఒకటి పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌లోని నవాన్‌షహర్ అనే ప్రాంతం కరోనాకు హాట్‌స్పాట్ కేంద్రం. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది కరోనా పేషెంట్లున్న ఐసోలేషన్ వార్డులో డాక్టర్ గుర్పాల్ కటారియా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే జలంధర్‌లో డాక్టర్ కుటుంబం నివసిస్తుంది. కటారియా రెండు వారాలుగా ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రిలోనే ఉంటున్నారు. వీలుచిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవారు. అయితే శనివారం కొంత విరామ సమయం లభించడంతో జలంధర్‌లోని తన ఇంటికి వెళ్లారు.
ముందుజాగ్రత చర్యగా ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం ముందే నిలబడి తన భార్య, కూతురిని పలకరించాడు. వారు ఇచ్చిన కాఫీ తాగి వెంటనే తిరిగి నవాన్‌షహర్‌కు బయలు దేరాడు. పక్షం రోజుల తరవాత ఇంటికొచ్చిన కటారియా తన కుటుంబ సభ్యులతో గడిపిన సమయం కేవలం పది నిమిషాలు మాత్రమే. ఇటీవలే పదో తరగతి పరీక్షలకు హాజరైన తన కూతురు తగిన జాగ్రతలు చెప్పడమే కాకుండా, తన తల్లిదండ్రులు ప్రజాసేవలో ఉన్నందుకు గర్వపడుతున్నానని అనడం తనకు ఎంతో మనోస్థయిర్యాన్ని కలిగించిందని కటారియా అన్నారు. కటారియా భార్య కూడా డాక్టరే. హోషియార్‌పూర్ సివిల్ ఆసుపత్రిలో ఆమె దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు.