బ్రీత్ ఎనలైజర్ పరీక్షలపై హైకోర్టు సంచలన ఆదేశాలు
ABN , First Publish Date - 2020-03-23T18:25:31+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు చేస్తున్న బ్రీత్ ఎనలైజర్ పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ....

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ అధికారులు చేస్తున్న బ్రీత్ ఎనలైజర్ పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్నందున ఈ నెల 27వతేదీ వరకు ఎయిర్ ట్రాఫిక్ అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ట్యూబ్ పద్ధతిలో బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తాత్కాలికంగా చేయకుండా నిషేధించాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ (ఇండియా) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయవద్దంటూ ఆదేశాలిచ్చింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను ట్యూబ్ సాయంతో కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించేలా వైద్యఆరోగ్య శాఖ డైరెక్టరు జనరల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు.
మందుబాబులను గుర్తించేందుకు రక్తం, మూత్ర పరీక్షలు చేసే పద్ధతి అవలంభించవచ్చా పరిశీలించాలని కోర్టు వైద్యాధికారులను ఆదేశించింది. బ్రీత్ ఎనలైజర్ టెస్టుల స్థానంలో సెల్ఫ్ డిక్లరేషన్ లను ఏటీసీలకు సమర్పించాలని, దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కో్ర్టు సూచించింది. కాగా పౌరవిమానయాన శాఖ ఉత్తర్వుల ప్రకారం బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయడం తప్పని సరి అని పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ అంటున్నారు.