కరోనాకు ఏ వ్యాక్సిన్‌ ముందుగా మార్కెట్‌లోకి వస్తుంది?

ABN , First Publish Date - 2020-09-04T02:36:39+05:30 IST

అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి ఇలా ఉంది. మరి.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న..

కరోనాకు ఏ వ్యాక్సిన్‌ ముందుగా మార్కెట్‌లోకి వస్తుంది?

అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి ఇలా ఉంది. మరి.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న సంస్థల పరిస్థితి ఏంటి? అధ్యయనాల పురోగతి ఏంటి? ఏ వ్యాక్సిన్‌ ఏ దశలో ఉంది? ఏది ముందుగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 


కరోనా మహమ్మారి బయట పడిన తర్వాత ప్రపంచాన్ని చుట్టేసినప్పటినుంచీ ఓవైపు చికిత్సలు అందిస్తూనే.. మరోవైపు, దీని విరుగుడు కోసం వ్యాక్సిన్ల తయారీ కూడా ప్రారంభమైంది. ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోన్న ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు అనేక దేశాలు ప్రయోగాల్లో మునిగిపోయాయి. వీటిలో చాలా దేశాలు మొదటగా వ్యాక్సిన్‌ తయారుచేసిన ఘనత దక్కించుకోవాలన్న ఆతృతలోనూ ఉన్నాయి. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించాలని పోటీ పడుతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా నమోదైన కంపెనీలు చూస్తే.. ఆయా దేశాలకు చెందిన 44 కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద నమోదు చేసుకున్న కంపెనీలు. డబ్ల్యుహెచ్‌వో వద్ద రిజిస్టర్‌ చేసుకోకుండా కూడా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ తయారీ చేస్తున్నాయి. నమోదు చేసుకోకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ చేసుకుంటున్న వాటిలో మొన్నటికి మొన్న వార్తల్లో నిలిచిన రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి కూడా ఉంది.


మొత్తం 44 కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వాటిలో 4 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో 3వ దశలో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్లు 2వ, మూడో దశ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఒకటి 2-బి దశలో ఉంది. మరో పది వ్యాక్సిన్లు రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఎనిమిది వ్యాక్సిన్లు ఒకటో దశ ట్రయల్స్‌ చేపడుతున్నాయి. మిగతావి ప్రీ క్లినికల్‌ స్టేజ్‌లో ఉన్నాయి.


కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారంగా మారిందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు ఇప్పటికి మూడోదశ ప్రయోగాలకు చేరుకున్నాయి. తొట్టతొలిగా మార్కెట్‌లోకి వచ్చే వ్యాక్సిన్‌ను తమ మార్కెట్‌లలో విడుదల చేసేందుకు దాదాపు అన్ని దేశాలూ ఉవ్విళ్లూరు తున్నాయి. వ్యాక్సిన్‌ మొదటగా విడుదల చేసే కంపెనీలతో కొన్ని దేశాలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.



ఈ పోటీలో రష్యా ఇప్పటికే  రేసులో ముందంజలో ఉన్నామని స్వయంగా ప్రకటించుకుంది. ఇక కీలకమైన మూడోదశ ప్రయోగాల్లో ఉన్నవి ప్రపంచవ్యాప్తంగా ఐదు కంపెనీలు మాత్రమే. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ , మోడెర్నా వ్యాక్సిన్, ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్‌లు. ఈ అన్ని కంపెనీల్లో వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భావిస్తోంది. అయితే.. వీటన్నింటిలోనూ ఎక్కువగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నారు.


భారత్‌ కూడా  ఈ వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకుంది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాగ్జిన్,  జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్-డి వ్యాక్సిన్‌లు 1-2 దశల్లో ఉన్నాయి. భారత్‌కు చెందిన సంస్థ సరఫరా ఒప్పందం చేసుకున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడోదశలో దూసుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఇండియాకు చేరే తొలి వ్యాక్సిన్ కచ్చితంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న 'కోవిషీల్డ్' మాత్రమే అనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు.


భారత్‌ దీనిపై ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం.. భారత్‌లోని పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్‌ల ఉత్పత్తి, సరఫరాలో సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మరోవైపు.. ఉత్తత్తి చేసే వ్యాక్సిన్‌లో 50 శాతం మనదేశానికే కేటాయిస్తామని కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. అందుకే ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ ఈ నెలాఖరుకి మూడోదశ పూర్తి చేసుకుని.. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇక.. దేశాలన్నీ ఎవరికి వారే సొంతంగా చేసుకునే ప్రాజెక్టులపైనే దృష్టిపెట్టగా.. కొన్నిదేశాలు ఉమ్మడిగా కూడా ఈ వ్యాక్సిన్‌ తయారీపై దృష్టిపెట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్‌ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కోవాక్స్‌ వాక్సిన్‌ గ్రూపులో 76 దేశాలు చేరాయి. వ్యాక్సిన్‌ను‌ అభివృద్ధి చేసి.. అంద‌రికీ అందే విధంగా ఆయా దేశాలు ప‌ర్యవేక్షించ‌నున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 'గావి వ్యాక్సిన్ గ్రూపు' నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. కోవాక్స్ ప్రాజెక్టులో జ‌పాన్, జ‌ర్మనీ, నార్వే లాంటి సంప‌న్న దేశాలు జ‌త‌కూడిన‌ట్లు గావి వ్యాక్సిన్ అలియ‌న్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీత్ బెర్ల్కీ  చెప్పారు.  కోవాక్స్ వ్యాక్సిన్‌ను ప్రొక్యూర్ చేసుకునేందుకు ఆయా దేశాల‌న్నీ ఒప్పందంపై సంత‌కం చేశాయ‌న్నారు.


జీఏవీఐ, డ‌బ్ల్యూహెచ్‌వో, సీఈపీఐలు సంయుక్తంగా కోవాక్స్ టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు అక్రమంగా ఈ టీకాల‌ను నిల్వ చేయ‌కుండా ఉండేందుకు చ‌ర్యలు తీసుకోనున్నారు. ఎక్కువగా వైర‌స్ ప్రభావానికి గురయ్యే వారికి ముందుగా ఆ వ్యాక్సిన్ ఇవ్వాల‌న్న నియ‌మాన్ని విధించారు. కోవాక్స్ కోసం ధ‌నిక దేశాలు ఫైనాన్స్  చేయ‌నున్నాయి. ఆ దేశాల‌న్నీ సుమారు 92 పేద దేశాల‌కు వ్యాక్సిన్ స‌మానంగా అందే విధంగా చ‌ర్యలు తీసుకోనున్నట్లు బెర్ల్కీ చెప్పారు. అయితే కోవాక్స్ ప్రాజెక్టులో చేర‌డం లేద‌ని అమెరికా స్పష్టం చేసింది. 


కోవాక్స్ ప్రాజెక్టును వెల‌క‌ట్టలేని బీమా పాల‌సీ అని డ‌బ్ల్యూహెచ్‌వో అభివర్ణిస్తోంది. సుర‌క్షిత‌మైన‌, ప్రభావంత‌మైన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అన్ని దేశాలు పొంద‌వ‌చ్చు అని తెలిపింది. ప్రాజెక్టులో చేరాల‌నుకునే దేశాల‌కు సెప్టెంబర్ 18వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. 2021 చివ‌రి నాటికి సుమారు రెండు మిలియ‌న్ల కోవాక్స్ డోసుల‌ను స‌ర‌ఫరా చేయాల‌ని ఈప్రాజెక్ట్‌లో భాగంగా నిర్ణయించారు.  ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. అమెరికా మాత్రం తొందరపడుతోంది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ను తీసుకురావాలని తాపత్రయపడుతోంది. 


- సప్తగిరి గోపగాని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-09-04T02:36:39+05:30 IST