కొత్త కేసులు 600..మరణల సంఖ్యల 40

ABN , First Publish Date - 2020-05-09T13:22:26+05:30 IST

దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించామని, మరణాల రేటు కూడా మన రాష్ట్రంలోనే చాలా తక్కువని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ పేర్కొన్నారు.

కొత్త కేసులు 600..మరణల సంఖ్యల 40

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించామని, మరణాల రేటు కూడా మన రాష్ట్రంలోనే చాలా తక్కువని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ పేర్కొన్నారు.  మీడియాతో ఆయన  శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంటైన్మెంట్‌ జోన్లను కట్టుదిట్టడం చేసి కరోనాను కట్టడి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,16,416 నమూనాలను సేకరించి, 2,06,407 మందిని పరీక్షించారు. శుక్రవారం 13,833 మందికి పరీక్షలు చేయగా, 600 మందికి  పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరిలో 399 మంది చెన్నైకి చెందినవారే. దీంతో చెన్నైలో మొత్తం బాధితుల సంఖ్య 3043కి చేరింది. చెంగల్పట్టులో 26, కడలూరులో 34, తిరువళ్లూరులో 75, విల్లుపురంలో 21, తిరువణ్ణామలైలో 11, కాంచీ పురం, కన్నియకుమారిలో ఎనిమిది చొప్పున, ధర్మపురి, కృష్ణగిరి, మదురైల్లో రెండేసి చొప్పున, రామనాథపురం, శివగంగ, తేని, తిరుపత్తూరు, తిరుచ్చిలో ఒక్కొక్కటి చొప్పున, తిరునల్వేలిలో నాలుగు, విరుదునగర్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కాగా శుక్రవారం చెన్నైలో ఇద్దరు, తిరునల్వేలిలో ఒకరు మరణిం చడంతో మృతుల సంఖ్య 40కి చేరింది. అలాగే ఇక శుక్రవారం 58 మంది డిశ్చార్జి కావడంతో,  కోలుకున్నవారి సంఖ్య 1,605 నమోదైంది.


ఆందోళన చెందొద్దు : ఆరోగ్యశాఖ మంత్రి

విస్తృతంగా పరీక్షలు చేస్తుండడంతో కరోనా కేసులు పెరుగు తున్నాయి. దీనిని చూసి ప్రజలు భయపడొద్దని ప్రజలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘కంటైన్మెంట్‌ జోన్లను సమర్ధం గా నిర్వహిస్తున్నాం. ఢిల్లీ క్లస్టర్‌ సమయంలో రాష్ట్రంలో ఎంత నేర్పుగా గుర్తించి చికిత్సలందించామో అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు కోయంబేడు క్లస్టర్‌ ద్వారా కరోనా వ్యాపిస్తున్న విష యాన్ని గ్రహించి ట్రేసింగ్‌, ట్రాకింగ్‌ చేస్తుండడం వల్లే కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో చేపడుతున్న కరోనా వ్యాప్తి నిరోధక చర్యలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రశంసించింది. వైద్య సేవలు అత్యుత్తమంగా ఉన్నాయని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, పారదర్శకంగా గణాంకాలు విడుదల చేస్తున్నారని కొనియాడింది.’ అని చెప్పారు.


పాజిటివ్‌ ఉన్నా ఇంటికి ఎందుకంటే..!

కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని ఇంటికి పంపిస్తుండడంపై మంత్రి  స్పందిస్తూ ‘ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారంలో ఈ చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవు. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే లక్షణాలున్నాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో పాజిటివ్‌ ఉన్నా ఎటువంటి లక్షణాలు, ఇతరత్రా వ్యాధులు కూడా లేనివారిని వైద్యుల సూచనల మేరకు ఇంటికి పంపిస్తున్నాం. హోం క్వారంటైన్‌లో ఉంచినా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేక గది, ఎటాచ్డ్‌ బాత్‌రూమ్‌, భౌతికదూరం పాటించేందుకు విశాలమైన స్థలం ఉందా వంటి అంశాల ను అధికారులు స్వయంగా పర్యవేక్షించాకే అనుమతిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ప్రత్యేక కిట్‌ ఇస్తున్నాం. అందులో.. పాజిటివ్‌ వచ్చిన వారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వంటి మార్గదర్శకాలుంటాయి. అలాగే రీ యూజబుల్‌ మాస్కులు, జింక్‌, విటమిన్‌-సి, డి మాత్రలు, కేంద్ర ఆయుష్‌ సూచించిన కబసుర, నీలవేము కషాయం, సబ్బు, శానిటైజర్లు ఈ కిట్‌లో ఉంటాయి. ఆస్పత్రుల్లో వసతుల్లే ఇళ్లకు పంపిస్తున్నా మన్నది అవాస్తం. ఆస్పత్రుల్లో తగిన వసతులున్నాయి. ఇంకా పెంచుతున్నాం. మధుమేహం, డయాలసిస్‌, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా చూసుకోవాలి. ఈ విపత్కర సమయంలో ప్రజల సహకారం, బాధ్యత చాలా అవసరం. కరోనాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-09T13:22:26+05:30 IST