మందుబాబులకు షాక్..!
ABN , First Publish Date - 2020-05-09T13:18:16+05:30 IST
రాష్ట్రంలోని మందుబాబు లకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లాక్‌డౌన్ ముగిసే వరకు టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం తీర్పు చెప్పింది.
టాస్మాక్ దుకాణాలు మూసివేయాలని హైకోర్టు ఆదేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మందుబాబు లకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లాక్‌డౌన్ ముగిసే వరకు టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం తీర్పు చెప్పింది. దాదాపు 43 రోజుల తరువాత చెన్నై మినహా రాష్ట్రవ్యాప్తం గా గురువారం టాస్మాక్ దుకాణాలను తెరిచిన విషయం తెలిసిందే. తొలి రోజే రికార్డు స్థాయిలో రూ.172 కోట్లు, రెండోరోజు రూ.125 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. అయితే కోర్టు నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం, భద్రత తక్కువగా ఉండడం, ఒకరికే అధికంగా మద్యం విక్రయించడం వంటి కారణాలను హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. ఫలితం గా లాక్‌డౌన్ ముగిసేవరకు మద్యం దుకాణాలను మూసి వేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు చేసుకోవచ్చని, ఇందుకు తగ్గట్టుగా టాస్మాక్ సంస్థ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. టాస్మాక్ దుకాణాలను ప్రారంభించడాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ సూచన మేరకు ఆ పార్టీ న్యాయవాది కార్తీక్ రాజా హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. తీర్పుపై కమల్ స్పందిస్తూ... న్యాయస్థానంపై నమ్మకాన్ని, ఎప్పటికైన సత్యమే జయిస్తుందని నిరూపించేలా ఈ తీర్పు ఉందని, ఇది తమ పార్టీ విజయం మాత్రమే కాదని, తమిళనాడు మొత్తం ఆనందించాల్సిన విషయమని ట్విట్టర్‌లో సందేశం విడుదల చేశారు. ఇదిలా ఉండగా, రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. హైకోర్టు తీర్పుపై వారందరూ హర్షం వ్యక్తం చేశారు.