కరోనా బాధితులు కాదు..కరోనాయే మన శత్రువు

ABN , First Publish Date - 2020-04-05T13:37:14+05:30 IST

కరోనా బాధితులు కాదు..కరోనాయే మన శత్రువు

కరోనా బాధితులు కాదు..కరోనాయే మన శత్రువు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ మాత్రమే తమకు ప్రధాన శత్రువు అని, కరోనా బాధితులు, రోగులను శత్రువులుగా పరిగణించకూడదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ హితవు పలికారు. ఈ మేరకు  తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన జారీ చేశారు.  ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకోవడం తన ఆనవాయితీ అని, అలాంటిది కరోనా మహమ్మారి తననే కాకుండా ప్రజలందరినీ ఇంటిపట్టునే గడిపే పరిస్థితి తీసుకువచ్చిందని అన్నారు. కరోనా వైరస్‌ సోకిన లక్షణాలతో ప్రత్యేక వార్డులలో చికిత్స పొందుతున్నవారిని చికిత్సలందించే వైద్యులు తప్ప మరెవరూ చూడలేని దుస్థితి దాపురించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించి గృహనిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలంతా వారి ఇళ్ళల్లోనే గడిపితే కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలుగుతామని, ఆ కారణంగా తాను ప్రజలకు వీడియో ద్వారా తగు సూచనలు, సలహాలు ఇస్తున్నానని తెలిపారు.


కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుందన్న కారణంగానే అరివాలయంలోని కళైంజర్‌ అరంగాన్ని ఐసొలేషన్‌ వార్డులుగా వాడుకోమని కార్పొరేషన్‌ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేశామని, ఇదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ డీఎంకే స్థానిక శాఖ నాయకులు అక్కడి పార్టీ కార్యాలయాలు, వారి స్వంత భవనాలను కూడా కరోనా బాధితులకు ప్రత్యేక వార్డుల కోసం కేటాయిస్తున్నారని స్టాలిన్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్న కరోనా నిరోధక చర్యలకు తగు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ డీఎంకే తరఫున మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, అత్యవసర పనుల నిమిత్తం వచ్చే ప్రజలందరినీ సామాజిక దూరం పాటించమని పార్టీనేతలు అవగాహన ప్రచారం కూడ సాగిస్తున్నారని తెలిపారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన ముమ్మరంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే పరీక్షిస్తే చాలదని, మరిన్ని ప్రయోగశాలలు ఏర్పాటు చేసి కరోనా వైరస్‌ సోకే ఆస్కారమున్న ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి కూడా పరీక్షలు జరపాలని, అప్పుడే ఆ వైరస్‌ను పూర్తిగా నిరోధించడానికి వీలుపడుతుందని అన్నారు. మరిన్ని ప్రయోగశాలలు నెలకొల్పేందుకు, కరోనా వైరస్‌ సోకినవారికి మెరుగైన చికిత్సలందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా ఉందని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T13:37:14+05:30 IST