కొత్తగా 74 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-05T12:40:23+05:30 IST

కొత్తగా 74 మందికి పాజిటివ్‌

కొత్తగా 74 మందికి పాజిటివ్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో కరోనా సోకిన వారి సంఖ్య 485కి చేరింది. కొత్తగా శనివారం ఒక్కరోజే 74 మందికి పాజిటివ్‌ అని తేలింది. వీరిలో 73 మంది ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చినవారే. అంతేకాదు, రాష్ట్రంలోని మొత్తం బాధితుల్లో 422 మంది ఢిల్లీ నుంచి తిరిగొచ్చినవారేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ తెలిపారు. ఈ మేరకు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా 74 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని, దీంతో తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 485కి పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,541 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, 5,300 మందికి పైగా క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఇంకా 407 మంది రక్త నమూనాల పరిశోధన నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 4,248 మంది నమూనాలు పరీక్షించగా, 3356 మందికి నెగిటివ్‌ వచ్చిందని వివరించారు. ఇక కంటైన్‌మెంట్‌ యాక్టివిటీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,23,491 ఇళ్లలో తనిఖీలు జరిపామని వివరించారు. రాష్ట్రంలో కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందని, కరోనా బాధితులందరి ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ యాక్టివిటీ తీవ్రతరం చేశామని, ప్రజలు సామాజిక దూరాన్ని మరింత దీక్షగా పాటించాలని బీలా రాజేష్‌ సూచించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 135 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Updated Date - 2020-04-05T12:40:23+05:30 IST