తిరుచ్చి నుంచి మలేసియాకు అత్యవసర విమాన సర్వీసు

ABN , First Publish Date - 2020-04-01T15:16:15+05:30 IST

తిరుచ్చి నుంచి మలేసియాకు అత్యవసర విమాన సర్వీసు

తిరుచ్చి నుంచి మలేసియాకు అత్యవసర విమాన సర్వీసు

చెన్నై, (ఆంధ్రజ్యోతి) : మలేసియా నుంచి తిరుచ్చికి నడుపుతున్న మలిండో విమాన సర్వీసును ఏప్రిల్‌ 2 నుంచి మూడు రోజులపాటు అత్యవసర సర్వీసులుగా నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతటా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ పాటిస్తుండటంతో అన్ని అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. దీంతో తిరుచ్చిలో మలేసియాకు చెందిన వందలాదిమంది పర్యాటకులు చిక్కుకున్నారు. వారంతా అక్కడి స్టార్‌ హోటళ్ళలో వారం పైగా బసచేస్తున్నారు. వీరంతా మలేిసియాకు తిరిగి వెళ్ళడానికి రాయబార కార్యాలయ అధికారులు ద్వారా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం వారంతా తమ దేశం నుంచి తెచ్చుకున్న కరెన్సీ అంతా ఖర్చయిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుచ్చి పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్న మలేసియా వాసులను స్వదేశానికి తరలించే నిమిత్తం ఏప్రిల్‌ 2 నుంచి మూడు రోజుల పాటు తిరుచ్చి- మలేసియాల మధ్య విమాన సర్వీసులను నడుపనున్నారు. తొలుతగా మలేషియా నుంచి మలిండో ఎయిర్‌ సంస్థకు చెందిన విమానం ఏప్రిల్‌ 1వ తేదీ రాత్రి 10.35కి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుటుంది. తిరుచ్చిలో ప్రయాణికులను ఎక్కించుకుని రెండో తేదీ వేకువజామున తిరిగి మలేసియాకు వెళుతుంది. ఇదే విధంగా ఏప్రిల్‌ మూడు, నాలుగు తేదీల్లో ఆ విమానం ఉదయం 9.35కి తిరుచ్చిలో ల్యాండ్‌ అయి, ప్రయాణికులను ఎక్కించుకుని ఉదయం 10.25కు మలేసియాకు వెళ్తుందని అధికారులు తెలిపారు. తిరుచ్చి పరిసర ప్రాంతాల్లో అలమటిస్తున్న మలేసియా పర్యాటకులను స్వస్థలానికి పంపటం కోసమే ఈ విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-01T15:16:15+05:30 IST