‘కరోనా’పై విజయం సాధించాలి

ABN , First Publish Date - 2020-04-01T08:36:16+05:30 IST

‘‘కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‌ విజయం కీలకం. ఈ పోరులో మన దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రజలు ఇళ్లలోనే...

‘కరోనా’పై విజయం సాధించాలి

రాబోయే రెండు వారాలే కీలకం : వెంకయ్య


న్యూఢిల్లీ, మార్చి31(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‌ విజయం కీలకం. ఈ పోరులో మన దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వాలకు సహకరించాలి. ఐకమత్యంగా, బాధ్యతాయుతంగా ఉంటే విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కరోనా ప్రభావంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ కార్యదర్శితో ఆయన మంగళవారం మాట్లాడారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు, లాక్‌డౌన్‌ ఆచరణకు కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు చేస్తున్న కృషికి ప్రజల సహకారం అభినందనీయమన్నారు. రైలు బోగీలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మారుస్తున్న విధానం, డాక్టర్లు, పరిశోధకులు తక్కువ సమయంలోనే వెంటిలేటర్లు, కరోనా నిర్ధారక కిట్లను తయారుచేయడం వంటి నూతన ఆవిష్కరణలు భారత్‌ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాయని తెలిపారు. అక్కడక్కడ ఇబ్బందిపడుతున్న వలస కార్మికులు, రైతుల కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వాలకు స్థానికుల సహకారం అవసరమన్నారు. పంటలు చేతికొచ్చే ఈ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొని, రైతులను ఆదుకోవాలని వెంకయ్య సూచించారు. లాక్‌డౌన్‌ అమలులో తొలివారం ఫలితం సంతృప్తిగా ఉందని, మిగిలిన రెండువారాల లాక్‌డౌన్‌ కూడా అత్యంత కీలకమేనన్నారు. అది విజయవంతం కావడానికి సంపూర్ణ సహకారం అందించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు తోచినంత విరాళాలు ఇవ్వడంతో పాటు కరోనాపై పోరాటంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పోలీసు బలగాలు, పారిశుధ్య సిబ్బందికి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2020-04-01T08:36:16+05:30 IST