కరోనా వ్యాక్సిన్.. ట్రంప్ కుట్రకు జర్మనీ బ్రేక్?
ABN , First Publish Date - 2020-03-16T20:28:59+05:30 IST
అమెరికా అధ్యక్షుడు భారీ కుట్రకు తెరలేపారా? కరోనా వ్యాక్సిన్ అమెరికన్లుకు మాత్రమే దొరికేలా ప్లాన్ చేశారా? అంటే అవుననే అంటోంది ఓ జర్మన్ పత్రిక
న్యూఢిల్లీ: కరోనా కలకలం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ కుట్రకు తెరలేపారా? కరోనా వ్యాక్సిన్ అమెరికన్లుకు మాత్రమే లభ్యమయ్యేలా ప్లాన్ చేశారా? అంటే అవుననే అంటోంది ఓ జర్మన్ పత్రిక. ఆ పత్రికలో ప్రచురితమైన ఓ సంచలన కథనం ప్రకారం.. జర్మనీకి చెందిన క్యూర్‌వ్యాక్ అనే బయోఫార్మాసిటికల్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్సనలో కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు.. కంపెనీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలంటూ క్యూర్‌వ్యాక్ ముందుకు ఓ ఆఫర్ తెచ్చారట. ఈ దిశగా భారీగా డబ్బు ఆశ చూపించారట.
ఈ వ్యాక్సిన్ కేవలం అమెరికన్లకు మాత్రమే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ చర్యకు దిగారని సదరు పత్రిక ప్రచురించింది. అయితే విషయం తెలిసి జర్మనీ ప్రభుత్వం రంగంలోకి దిగి.. సదరు కంపెనీకి మరో ఆఫర్ ఇవ్వడంతో క్యూర్ వ్యాక్ తరలింపు ఆగిపోయినట్టు తెలిసింది. ఈ కథనం నిజమేనని జర్మనీ ఆరోగ్య శాఖా మంత్రి కూడా అంగీకరించడంతో ఈ విషయం మరింత సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో క్యూర్ వ్యాక్ కంపెనీ ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది. తమను టేకోవర్ చేసేందుకు జరిగిన ప్రయత్నాలను తిప్పికొట్టామని తెలిపింది. ‘కరోనా వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలనేదే మా అభిమతం’ అని సంస్థ తెలిపింది.
మరోవైపు... అమెరికా వర్గాలు ఈ వార్తలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాయి. ‘వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము అని ప్రకటించుకున్న అనేక కంపెనీలతో అమెరికా ప్రభుత్వం చర్చించింది. కొన్ని కంపెనీల్లో అమెరికా మదుపర్లు పెట్టుబడి పెట్టారు. కరోనా సమస్యకు చెక్ పెట్టే పరిష్కారాలని అమెరికా.. మిగతా దేశాలతో కచ్చితంగా పంచుకుంటుంది’ అని ఓ అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.